Telangana Fee Reimbursement | ఫీజు రీయింబర్స్మెంట్ వివాదం
Telangana Fee Reimbursement | ఫీజు రీయింబర్స్మెంట్ వివాదం
Telangana Fee Reimbursement | హైకోర్టు వ్యాఖ్యలతో ఫీజు రీయింబర్స్మెంట్ వివాదానికి కొత్త మలుపు
రూ.12 వేల కోట్ల బకాయిలతో కాలేజీలపై పెరుగుతున్న ఆర్థిక భారం
సర్టిఫికెట్ల జారీ ఆలస్యం.. ఉన్నత చదువులకు విద్యార్థులకు ఇబ్బందులు
ఆర్థిక సంక్షోభంలో ప్రైవేట్ విద్యాసంస్థలు.. పెరుగుతున్న డ్రాపౌట్లు
Telangana Fee Reimbursement | హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ప్రభుత్వ ఆలోచనలకు హైకోర్టు వ్యాఖ్యల బ్రేక్ పడినట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో విద్యావ్యవస్థపై ఏర్పాటు చేసిన కమిషన్ సిఫార్సుల అమలు సాకుగా చూపి ప్రైవేట్ విద్యాసంస్థలను ఇబ్బంది పెట్టాలన్న ప్రభుత్వ ఆలోచనలకు ఫుల్ స్టాప్ పడిందని విద్యావేత్తలు అంటున్నారు. అదే సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను సాకుగా చూపి విద్యార్థులను వేధిస్తున్న కాలేజీ యాజమాన్యాలపై కూడా న్యాయస్థానం దృష్టిసారిస్తే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్లు పనితీరు సక్రమంగా లేని ప్రైవేట్ కళాశాలలకు ఆ పథకాన్ని ఉపసంహరించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికలో ప్రస్తావించింది.
ఇది ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఉపసంహరించాలనే ఎత్తుగడలో భాగమేనని విద్యావేత్తల నుంచి ఆందోళన వ్యక్తమవుతుండగా, ఆ కళాశాలల్లో చేరిన విద్యార్థులు సొంతంగా ఫీజులు చెల్లించుకోవాల్సి ఉంటుందనే ప్రచారం జోరుగా జరిగింది. దీంతో కాలేజీలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న తమ నిధులను సాధించుకునేందుకు ప్రయత్నాలు తీవ్రం చేశాయి. ఈ క్రమంలోనే హైకోర్టును ఆశ్రయించాయి. ప్రభుత్వం ఇవ్వకపోతే విద్యార్థుల నుంచి వసూలు చేసుకునేందుకు కూడా యోచించాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మెజారిటీ కాలేజీలు కోర్సులు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఇది విద్యార్థుల ఉన్నత చదువులకు, పలు కోర్సుల్లో చేరేందుకు ఇబ్బందిగా మారిందనే వాస్తవాలూ వెలుగులోకి వచ్చాయి.
రూ.12 వేల కోట్లకు పైగా బకాయిలు
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు గుట్టల్లా పేరుకుపోయాయి. ఈ విద్యాసంవత్సరానికి కలిపితే బకాయిలు మొత్తం రూ.12 వేల కోట్లకు పైగా చేరాయి. ఏటా రూ.2,500 కోట్లు ఈ పథకం కోసం విడుదల చేయాల్సి ఉండగా, కాంగ్రెస్ సర్కార్ వచ్చాక 10 శాతం నిధులను కూడా విడుదల చేయలేదు. కాలేజీ యాజమాన్యాలు అసోసియేషన్‌గా ఏర్పడి 2025 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కాలేజీల నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి.
కాలేజీల ఆందోళన నేపథ్యంలో సర్కార్ కేవలం రూ.500 కోట్లు మాత్రమే విడుదల చేసింది. బీసీ, ఈబీసీలకు లభించాల్సిన పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఇవ్వలేకపోతున్నది. కాలేజీల బంద్ సమయంలో సర్కార్ విజిలెన్స్ నివేదిక, తనిఖీలంటూ యాజమాన్యాలను భయపెట్టింది. కాలేజీలు వెనక్కి తగ్గగానే గప్‌చుప్ అయింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ పేరిట మరో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చి, కాలేజీలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నదని ఆరోపణలు వస్తున్నాయి.
ఆర్థిక సంక్షోభంలో విద్యావ్యవస్థ
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందనే అపవాదు వస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలన్న తేడాలేకుండా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని చెబుతున్నారు. డిగ్రీ కాలేజీలకు రావాల్సిన పెండింగ్ బకాయిలు రూ.500 కోట్లు ఉన్నాయని, దీంతో విద్యాపరమైన ఆటంకాలు ఏర్పడుతున్నాయని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. విభిన్న ఆర్థిక, సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందకపోవడంతో పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, అనధికారిక పనుల్లోకి వెళ్తున్నారు. దీంతో డ్రాపౌట్ల సంఖ్య పెరుగుతున్నది. కాలేజీలలో ఖాళీ సీట్లు ఉంటున్నాయని ప్రచారం జరుగుతోంది. ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అధ్యాపకులకు జీతాలు, రోజువారీ కార్యకలాపాల కోసం ఇక్కట్లు పడుతున్నాయి.
