గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా..

  • ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు
  • కాంగ్రెస్ పార్టీలోకి జీలకుంట సర్పంచ్

పెద్దపల్లి జిల్లా ఓదెల, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం జీలకుంట గ్రామంలో నిర్మించిన మహిళా సమైక్య భవనాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామంలో గత రెండున్నరేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ముఖ్యంగా గ్రామం నుంచి పందిళ్లకు వెళ్లే రహదారిని బీటీ రోడ్డుగా మార్చేందుకు కృషి చేస్తానన్నారు. స్థానిక మహిళా సమైక్య భవనానికి ప్రహరీ గోడతో పాటు పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు అన్ని విధాల అండగా నిలుస్తూ ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నారని తెలిపారు. గ్రామంలో మహిళా సంఘ భవనానికి భూమి దానం చేసిన కొట్టే మల్లారెడ్డి పేరును మహిళా భవనానికి పెడుతున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు పంటలకు సరిపడా కాలువ నీరు అందిస్తున్నారని చెప్పారు. వడ్ల కొనుగోళ్లలో కటింగ్ లేకుండా చర్యలు తీసుకుంటూ బోనస్ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. గ్రామంలోని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాగిడి మంగ శ్రీనివాస్ రెడ్డి, ఏపీఎం సంపత్, మాజీ ఎంపీటీసీ రాగిడి రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ రౌతు మనోజ్ క్రాంతివీర్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పిట్టలు రవికుమార్, ఓదెల మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, బొంగోని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన జీలకుంట సర్పంచ్

గత సర్పంచ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన జీలకుంట గ్రామ సర్పంచ్ రాగిడి మంగ శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామంలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన ప్రభుత్వ విప్ ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ రాగిడి మంగ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. గత ఎన్నికల్లో గ్రామ ప్రజల సహకారంతో సర్పంచ్‌గా గెలుపొందిన తాను గ్రామ అభివృద్ధినే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానన్నారు. ఎమ్మెల్యే విజయరమణారావుపై ఉన్న అభిమానంతో, గ్రామ అభివృద్ధిని కాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ఎమ్మెల్యే సహకారంతో ముందుకు సాగుతానని, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.