సీఎంకు ‘బిజినెస్ రిఫార్మర్’ అవార్డు..రాష్ట్రానికే గర్వకారణం…
సీఎంకు ‘బిజినెస్ రిఫార్మర్’ అవార్డు..రాష్ట్రానికే గర్వకారణం…
దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు..
అవనిగడ్డ – ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మకమైన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ – 2025 అవార్డు లభించడం పట్ల దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ముంబైలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి ఈ పురస్కారాన్ని అందుకోవడం రాష్ట్రానికే గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆదివారం అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుంచీ సంస్కరణలకే ప్రాధాన్యతనిస్తూ, టెక్నాలజీ ద్వారా అభివృద్ధిని సాధిస్తున్నారని కొనియాడారు. సంస్కరణలతోనే సంపద అనే నినాదంతో ఆయన చేస్తున్న కృషిని దేశం గుర్తించిందని, హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన అనుభవంతో నేడు అమరావతిని ఫ్యూచర్ సిటీగా, గ్రీన్ అండ్ బ్లూ సిటీగా నిర్మిస్తున్న తీరు అద్భుతమని అభినందించారు.
ముఖ్యంగా రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను ప్రవేశపెట్టి పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడం, సాధారణ ప్రజలను, పేదలను ఆదుకునేలా పీ-4వంటి వినూత్న కార్యక్రమాలను రూపొందించడం, అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే సంకల్పం లాంటి గొప్ప దార్శనికత కలిగిన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అతి త్వరలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ క్లస్టర్ ఇంచార్జ్ బండే రాఘవ, పార్టీ నాయకులు పర్చూరి దుర్గాప్రసాద్, కంచర్ల ఆనంద్, పాటిబండ్ల నరేష్, గుంటూరు వినయ్ తదితరులు పాల్గొన్నారు.
