కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలి

ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : దీర్ఘకాలిక ప్రజాయుద్ధ ప్రజాపంథానే భారతదేశ విముక్తికి సుగమమైన మార్గమని, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవునూరి మధు అన్నారు. తొలుత మర్కోడు, ఆళ్లపల్లి ప్రాంతాల్లోని డెమోక్రసీ పార్టీ జెండా ఆవిష్కరణలు ఘనంగా నిర్వహించారు.

అనంతరం ఆవునూరి మధు మాట్లాడుతూ.. పీడిత ప్రజల విముక్తికి మార్క్సిజం, లేనినిజం, మావో ఆలోచన విధానం వెలుగులో దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథానే సరైన మార్గమన్నారు. మార్క్సిస్టు మహోపాధ్యాయులు లెనిన్ జయంతి, సిపిఐ ఎంఎల్ జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం ప్రతి కార్మిక కర్షక పౌరుడి పై ఎంతో బాధ్యత ఉందన్నారు. సిపిఎం రివిజనిస్టు పంథాను వ్యతిరేకిస్తూ భారత విప్లవోద్యమ నాయకులు 1969 ఏప్రిల్ 22న సిపిఐఎంఎల్ పార్టీని స్థాపించారన్నారు. ఎన్నో పోరాటాలు నిర్వహించి గోదావరి లోయ పరివాహక ప్రాంతంలో 10 లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు సాధించి పెట్టిందని గుర్తు చేశారు.

వేలాది మంది విప్లవకారులు తమ ప్రాణాలను అర్పించారన్నారు. నేడు కేంద్రంలోని ఆర్ఎస్ఎస్ మతోన్మాద బిజెపి ప్రభుత్వం కుల, మత భావజాలాన్ని రెచ్చగొడుతుందని పచ్చగా ఉన్న ఏజెన్సీ ప్రాంతాలను కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టి ప్రశ్నించే గొంతుకలను ఆదివాసుల పై దాడులను కొనసాగిస్తుందని వారు విమర్శించారు. మరో పక్క భారత రాజ్యాంగాన్ని నిర్విర్యం చేస్తూ మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొస్తుందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పథకాలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ఆకలి బాధలు, దోపిడి ఉన్నంతకాలం, దున్నేవాని చేతిలో భూమి వచ్చే వరకు విప్లవోద్యమాలు కొనసాగుతాయన్నారు. విప్లవశక్తులు ఐక్యమై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

అనంతరం మండలంలోని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం నాయకులు కొమరం సత్యనారాయణతో పాటు ఈశ్వరోజు బుచ్చిరాజం, వీరాచారి, పాయం సత్యం, పాయం రాంబాబు, కొమరం జనార్ధన్, మాస్ లైన్ పార్టీ నాయకులు పూసం రాంబాబు తదితరులు మాతృ పార్టీ న్యూడెమోక్రసీలో చేరారు. మండల కార్యదర్శి బట్టు ప్రసాద్ ఆధ్వర్యంలో వారిని సావధానంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. మర్కోడు సెంటర్లో కొమరం సత్యనారాయణ, ఆళ్లపల్లి సెంటర్లో పార్టీ డివిజన్ నాయకులు మెస్సు గోపాల్ పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కొక్కు సారంగపాణి, కాచనపల్లి సర్పంచ్ జరుపుల కిషన్, పార్టీ నాయకులు అటికం శేఖర్, బొర్ర వెంకన్న, పూనెం లక్ష్మణ్, మంగ, పెండకట్ల ముత్తక్క, వాగబోయిన రాంబాబు, మెస్సు రంగన్న, సురేష్, బతకయ్య, సత్యం, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply