వివాదాస్పద భూములపై అధికారుల క్షేత్రస్థాయి విచారణ

కలెక్టర్‌కు సమగ్ర నివేదిక అందజేస్తాం: తహశీల్దార్ మద్దినేని మురళి

దమ్మపేట, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండల పరిధి నల్లకుంట గ్రామంలో సర్వే నంబర్ 273/1లో ఉన్న వివాదాస్పద భూములను మంగళవారం దమ్మపేట తహశీల్దార్ (అండర్ ట్రైనీ డిప్యూటీ కలెక్టర్) మద్దినేని మురళి రెవెన్యూ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ భూముల యాజమాన్య హక్కులకు సంబంధించి ఇటీవల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అందిన దరఖాస్తుల నేపథ్యంలో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు.

అధికారులు భూమిని పరిశీలించేందుకు వస్తున్నారన్న సమాచారంతో దమ్మపేట మండల కేంద్రానికి చెందిన పలువురు రైతులు విచారణ స్థలానికి చేరుకున్నారు. దశాబ్దాలుగా ఈ భూములను గట్ల సర్వేశ్వరరావు, మళ్లా కమల, జంగాల వెంకటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్టు గోళ్ళ వెంకటేశ్వర్లు, గోళ్ళ సీతారావమ్మ, బొగ్గం శివ, బొగ్గం గ్రేసుమణి తదితరులు సాగు చేస్తున్నారని, వారే అసలు హక్కుదారులని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

సాగులో ఉన్న రైతులు తమ వద్ద ఉన్న న్యాయపరమైన పత్రాలు, సంబంధిత రికార్డులను కూడా అధికారులకు సమర్పించారు.

క్షేత్రస్థాయిలో భూమిని పరిశీలించి, రైతులు అందజేసిన పత్రాలను స్వీకరించిన అనంతరం తహశీల్దార్ మద్దినేని మురళి మాట్లాడుతూ, భూమికి సంబంధించిన అన్ని వివరాలను నమోదు చేశామని తెలిపారు. రైతులు సమర్పించిన పత్రాలతో పాటు ఇరువర్గాల రికార్డులను పారదర్శకంగా పరిశీలించి, వాస్తవాలతో కూడిన సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల గిర్దావర్, సర్వేయర్, గ్రామ పరిపాలనా అధికారి తదితరులు పాల్గొన్నారు.