గ్రామాల అభివృద్ధే ధ్యేయం

గ్రామాల అభివృద్ధే ధ్యేయం

కుంటాల/ నర్సాపూర్ జి, ఆంధ్రప్రభ : నియోజకవర్గంలోని గ్రామాలను దశల వారీగా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. నర్సాపూర్ మండలంలోని తిమ్మాపూర్, గొల్లమాడ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం, పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తిమ్మాపూర్ గ్రామంలో 90 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనం, పాఠశాల ప్రహరీ గోడ, మహిళా సమైక్య భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అదే విధంగా గొల్లమాడ గ్రామంలో 24 లక్షల రూపాయల నిధులతో చెరువు మరమత్తు పనులు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. విద్యా వైద్యం సాగునీరు అందించడమే లక్ష్యంగా తాను ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నానని, 28 ప్యాకేజీ పై పలుమార్లు అసెంబ్లీలో మాట్లాడడం జరిగిందన్నారు.

ఈ ప్యాకేజీ పూర్తయితే కుంటాల నర్సాపూర్ మండలాలకు 13 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. తను శాసన సభ్యునిగా ఎన్నికైనప్పటి నుంచి శాసనసభలో సమస్యల పై పలుమార్లు మాట్లాడడం జరిగిందని, అధికార పార్టీలో లేకున్నా అందరి సహకారంతో ప్రతి ఏట నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేపడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. గత పది సంవత్సరాల కాలంలో లేని విధంగా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి 25 కోట్ల నిధులు, ముధోల్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు 220 కోట్ల రూపాయల నిధులు ఒకేసారి మంజూరు కావడం సంతోషకరమన్నారు. గతంలో లేని విధంగా తన హాయంలో అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం జరగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పారు.

గొల్లమడ చెరువు ప్రధాన కాలువ సిసి లైనింగ్ కు నిధులు మంజూరు చేయిస్తానని, అదేవిధంగా తిమ్మాపూర్ గ్రామానికి బైపాస్ రోడ్డు నిర్మాణానికి నిధులు ఇస్తానని చెప్పారు. వ్యాపారుల దోపిడీని అరికట్టేందుకు రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు గతంలో లేని విధంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నా మన్నారు. దశల వారిగా సబ్ సెంటర్లను పెంచనున్నట్లు చెప్పారు. రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలన్నారు. దళారులకు రైతులు ఆశ్రయించకూడదని ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిన్న వసంత లస్మయ్య, మాజీ సర్పంచ్ చెన్న మహేష్, ఈ ఈ తుకారం, పంచాయతీరాజ్ డీ ఈ ఏఈతో పాటు పలువురు నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply