మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: డీఎస్పీ అశోక్

ఆసిఫాబాద్, ఆంధ్రప్రభ: ఆసిఫాబాద్ పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో బుధవారం ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ అశోక్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి జోలికి పోరాదని సూచించారు. మంచి లక్ష్యాలతో చదువుపై దృష్టి సారించి, క్రమశిక్షణతో ముందుకు సాగాలని తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం, కొనుగోలు, విక్రయం చట్టరీత్యా నేరమని వివరించారు.

ఎవరైనా మాదకద్రవ్యాలకు సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు తెలిసిన వెంటనే డయల్ 112 ద్వారా లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని విద్యార్థులకు సూచించారు.

అనంతరం డీఎస్పీ అశోక్ విద్యార్థులతో కలిసి పాఠశాల భోజనశాలలో భోజనం చేశారు. విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి విద్యాభ్యాసం, వసతి, భోజన సదుపాయాల గురించి తెలుసుకుని, కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ఎస్‌ఐ శ్రీకాంత్, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.