రోడ్డు ప్రమాదాలపై యుద్ధ ప్రాతిపదిక చర్యలు…

రోడ్డు ప్రమాదాలపై యుద్ధ ప్రాతిపదిక చర్యలు…
- తిరుపతి జిల్లా యంత్రాంగం బస్సు యాత్ర ప్రారంభం
తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తిరుపతి జిల్లా యంత్రాంగం వినూత్నంగా ప్రత్యేక బస్సు యాత్రను ప్రారంభించింది. మంగళవారం ఉదయం శిల్పారామం వద్ద జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు కలిసి ఈ కార్యక్రమంపై విలేకరుల సమావేశం నిర్వహించారు.

జిల్లాలో ప్రతి సంవత్సరం సగటున 550 నుంచి 560 మంది వరకు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని కలెక్టర్ తెలిపారు. జాతీయ రహదారుల విస్తరణ, తిరుమల భక్తుల రాక పెరగడం, ఓవర్ స్పీడింగ్, విశ్రాంతి లేకుండా డ్రైవింగ్, హెల్మెట్ వినియోగం లోపం, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలు వంటి కారణాల వల్ల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని చెప్పారు. గతంలో తీవ్రమైన ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి, జిల్లాలో మొత్తం 48 ప్రాంతాలను గుర్తించినట్లు వెల్లడించారు.

ఈ బ్లాక్ స్పాట్లను పోలీస్, రవాణా, ఆర్ & బి, జాతీయ రహదారులు, పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి రెండు బస్సుల ద్వారా ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ప్రాంతంలో రహదారి లోపాలు, స్థానిక పరిస్థితులను విశ్లేషించి, ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నామని చెప్పారు. తాత్కాలిక మరియు శాశ్వత పరిష్కారాలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తామని పేర్కొన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ‘జీరో డెత్ పాలసీ’ లక్ష్యంగా వచ్చే రెండు నుంచి మూడు నెలల్లో అన్ని బ్లాక్ స్పాట్లను పూర్తిగా సరిదిద్దే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. భద్రతా చర్యలలో భాగంగా బ్లింకర్లు, రంబుల్ స్ట్రిప్స్, హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అలాగే లాంగ్ డిస్టెన్స్ ప్రయాణికుల కోసం జాతీయ రహదారుల వెంట విశ్రాంతి ప్రాంతాల ఏర్పాటు పై సూచనలు ఇచ్చినట్లు తెలిపారు.

జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు మాట్లాడుతూ రోడ్డు భద్రతకు సంబంధించి సమగ్ర కార్యాచరణ చేపట్టామని చెప్పారు. ఒకవైపు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, మరోవైపు చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడింగ్ నియంత్రణ కోసం ఆల్కహాల్ మీటర్లు, స్పీడ్ గన్స్ వినియోగాన్ని పెంచుతున్నామని చెప్పారు.

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని, వాహనదారులు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ సూచించారు. తిరుపతి జిల్లాకు వచ్చే భక్తులు, స్థానికులు అందరూ రహదారి భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ నష్టాలను తగ్గించేందుకు అధికారులు, మీడియా, ప్రజలు కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
