21staprilchintana | పూర్ణకుంభం ప్రాముఖ్యత ఏమిటి?

21staprilchintana | పూర్ణకుంభం ప్రాముఖ్యత ఏమిటి?
21staprilchintana | పూర్ణకుంభం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
ఆలయాల్లో పూర్ణకుంభ స్వాగతం సంప్రదాయం
సమాజంలో సమానత్వంపై సందేశం
సనాతన ధర్మంలో మార్పుల అవసరం
21staprilchintana | “పూర్ణ కుంభం” అంటే అత్యంత పవిత్రమైన, శుభప్రదమైన చిహ్నం. ఇది సంపద, సమృద్ధి, జ్ఞానం మరియు దైవిక ఆశీర్వాదాలకు ప్రతీక. ఒక కుండను నీటితో నింపి, దానిపై కొబ్బరి కాయను ఉంచి, చుట్టూ మామిడి ఆకులతో అలంకరించి పూర్ణకుంభాన్ని తయారు చేస్తారు. కుండలోని నీరు ‘జీవం’, కొబ్బరి కాయ ‘శిరస్సు’ లేదా దైవజ్ఞానం, మామిడి ఆకులు ‘ప్రకృతి శక్తి’గా భావిస్తారు.
సాధారణంగా స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు దేవాలయాలను సందర్శించినప్పుడు ఆలయ పూజారులు వారికి పూర్ణకుంభంతో ఎదురొచ్చి స్వాగతం పలుకుతారు. ఇలా చెబుతూ ఒక స్వామీజీ ఇటీవల రాజకీయ నాయకులు, మంత్రులు మందీ మార్బలంతో నానా హంగామా చేస్తూ ఆలయాలకు వస్తున్నారని, వారికి కూడా పూర్ణకుంభంతో ఆలయ సిబ్బంది స్వాగతం పలుకుతున్నారని, అలా చేయడం తప్పు అని, చేసిన వారికి, చేయించుకున్న వారికి పాపం వస్తుందని చెప్పారు.
అలా ఏ శాస్త్రం చెబుతుందో గానీ, కొన్ని మార్పులు చేస్తేనే మన సనాతన ధర్మం వృద్ధి చెందుతుందనిపిస్తుంది. స్వామీజీలకు, పీఠాధిపతులకు, మఠాధిపతులకు వారెలాగూ వేదాంత గ్రంథాలను అధ్యయనం చేసినవారే కాబట్టి వారు పరిశుద్ధ ఆత్మలు గాని అల్పులు కాదు అన్న స్పృహ వారికి ఉంటుంది. కాబట్టి వారికి పూర్ణకుంభంతో స్వాగతమిచ్చినా వచ్చే లాభం ఏమీ లేకపోవచ్చు.
రాజకీయ నాయకులకు ఇస్తే వారిలో అహంకారం పెరగక, ఆత్మవిశ్వాసం పెరిగితే మంచిది. ఇక అట్టడుగు వర్గాల ప్రజలు ఎంతో భక్తి, విశ్వాసాలతో దైవ దర్శనం కోసం వస్తారు. వారిలో మొదటే ఆత్మన్యూనతాభావం ఉంటుంది. వారిని హీనులు, నీచులు, అంటరానివారు అంటూ వెనక్కు పంపిస్తే వారు సనాతన ధర్మాన్నే అసహ్యించుకొని ఇతర మతాల్లోకి చేరిపోవడాన్ని చూస్తూనే ఉన్నాం.
నిజానికి అలాంటివారు ఆలయాలకు వచ్చినప్పుడు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, సత్కారాలు చేయాలి. వారిలో ఆత్మన్యూనతాభావం పోయి, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం అభివృద్ధి చెందుతుంది. పరబ్రహ్మం అందరిలోనూ ఉన్నప్పుడు వారికీ పూర్ణకుంభంతో స్వాగతం పలికితే తప్పేముంది?
హిందువులు ప్రతివారిలోని శాశ్వత ఆత్మనే చూస్తారు గానీ పాంచభౌతిక దేహాలను కాదు అనే మంచి పేరు హిందువులందరికీ దక్కుతుంది. హిందూ మతం దినదినాభివృద్ధి చెందుతుంది. ఒక సత్కార్యాన్ని చేస్తే మంచే జరుగుతుంది, పుణ్యమే వస్తుంది. గాని పాపం ఎలా వస్తుంది? అలా చెప్పే శాస్త్రం ఏదైనా బూజుపట్టిన భావజాలం గలదే. వెంటనే పక్కన పెట్టాల్సిందే దాన్ని. భగవద్గీత బోధించినట్టు అందరి పట్ల సమదృష్టి కలిగి ఉండాలి. సనాతన ధర్మాన్ని ఆచరించి, జీవింప చేయాలి.
— రాచమడుగు శ్రీనివాసులు
