పప్పు, సెనగలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

పప్పు, సెనగలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

మద్దతు ధర కల్పించాలని ఏపీ రైతు సంఘం డిమాండ్

కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లాలో రబీ సీజన్‌లో విస్తారంగా సాగుచేసిన పప్పు సెనగలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరికి విజ్ఞాపన పత్రాన్ని ఆయన అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఏ. కృష్ణ, రైతులు సుధాకర్, గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.

రైతు సంఘం నాయకులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలో ఈ ఏడాది వేలాది ఎకరాల్లో పప్పు సెనగ పంట సాగైంది. కొన్ని ప్రాంతాల్లో దిగుబడి తగ్గినప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో మంచి దిగుబడి నమోదైంది. అయితే మార్కెట్‌లో ధరలు లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.5850 మద్దతు ధర ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యం కావడంతో రైతులు తమ పంటను ప్రైవేట్ వ్యాపారస్తులకు తక్కువ ధరలకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.5000 కంటే తక్కువ ధరకు సెనగలు కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు మండలం బసాపురం గ్రామానికి చెందిన రైతు సుధాకర్ ఉదాహరణగా పేర్కొంటూ, ఆయన స్వంతంగా 1.5 ఎకరాలు, కౌలుకు తీసుకున్న మరో 9 ఎకరాల్లో పప్పు సెనగ పంట సాగు చేసి సుమారు 120 క్వింటాళ్ల దిగుబడి సాధించినప్పటికీ, గిట్టుబాటు ధర లభించక తీవ్ర నష్టపోయాడని వివరించారు.

ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్ల రైతులు ఆర్థికంగా దెబ్బతింటున్నారని విమర్శించారు. కనీసం ఇప్పటికైనా మిగిలి ఉన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి, ప్రకటించిన రూ.5850 కంటే తక్కువ కాకుండా ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరారు.

దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, సమస్యను తక్షణమే వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply