ఎండలను తట్టుకునేలా బీఎల్ఓలకు ప్రత్యేక కిట్లు..
జిల్లాకు చేరిన సామగ్రి
2203 మంది బూత్ లెవెల్ అధికారులకు 13 రకాల వస్తువులతో కిట్
త్వరలో నియోజకవర్గాల వారీగా పంపిణీ
కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ: ఎన్నికల నిర్వహణలో కీలక బాధ్యతలు నిర్వర్తించే బూత్ లెవెల్ అధికారుల (బీఎల్ఓలు) కోసం ప్రత్యేకంగా రూపొందించిన కిట్లు మంగళవారం కర్నూలు జిల్లాకు చేరుకున్నాయి. ఎన్నికల సన్నాహాలు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో బీఎల్ఓలకు అవసరమైన సామగ్రిని ముందుగానే అందుబాటులో ఉంచేందుకు ఎన్నికల శాఖ చర్యలు చేపట్టింది.

ప్రస్తుతం జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ఇంటింటికీ తిరిగి విధులు నిర్వహించే బీఎల్ఓల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక కిట్లను రూపొందించారు. క్యాప్, గొడుగు, వాటర్ బాటిల్ వంటి వస్తువులు వారికి ఎండ తీవ్రత నుంచి కొంత ఉపశమనం కలిగించనున్నాయి.
కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, పాణ్యం నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,203 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక బీఎల్ఓ విధులు నిర్వహిస్తుండగా, వారందరికీ 13 రకాల వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్లను అందజేయనున్నారు.
ఈ కిట్లలో ఈసీఐ లోగోతో కూడిన బ్యాగ్, క్యాప్, జాతీయ జెండా రంగులతో రూపొందించిన గొడుగు, ఒక లీటర్ వాటర్ బాటిల్, రైటింగ్ పుస్తకం, జెల్ పెన్, పెన్సిల్, ప్లాస్టిక్ స్కేల్‌తో పాటు ఫారం-6, ఫారం-7, ఫారం-8 వంటి ఎన్నికల ప్రక్రియకు అవసరమైన పత్రాలు ఉన్నాయి.
ఎన్నికల విధుల్లో బీఎల్ఓలు విస్తృతంగా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉండటంతో వారి అవసరాలకు అనుగుణంగా ఈ కిట్లను రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటికే జిల్లాకు చేరుకున్న ఈ కిట్లను త్వరలో నియోజకవర్గాల వారీగా పంపిణీ చేయనున్నారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించడంలో బీఎల్ఓలు కీలక పాత్ర పోషిస్తారని అధికారులు పేర్కొన్నారు.
జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లన్నీ దశలవారీగా పూర్తిచేస్తున్నామని, బీఎల్ఓలకు శిక్షణతో పాటు అవసరమైన సామగ్రిని సకాలంలో అందిస్తున్నామని ఎన్నికల శాఖ అధికారులు వెల్లడించారు. ఎన్నికల విధులు మరింత సజావుగా సాగేందుకు ఈ ప్రత్యేక కిట్లు ఉపయోగపడనున్నాయని తెలిపారు.
పోలింగ్ కేంద్రాల వివరాలు
కర్నూలు జిల్లాలో
8 నియోజకవర్గాలు ఉండగా
2203 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి
కర్నూలు నియోజకవర్గంలో 258 పోలింగ్ కేంద్రాలు
పాణ్యం 355
ఎమ్మిగనూరు 271
పత్తికొండ257
కోడుమూరు275
మంత్రాలయం237
ఆలూరు294
ఆదోని256 చొప్పున పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి
