గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల్లో ప్రమాదం

గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల్లో ప్రమాదం

  • డ్రైవర్ సురక్షితం, బీహార్ కూలికి తీవ్ర గాయాలు

కేసముద్రం, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్‌పట్నం శివారులో గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల సందర్భంగా ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. మెటీరియల్ తరలిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బ్రిడ్జి అంచున వేలాడుతూ నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవర్ సురక్షితంగా బయటపడగా, ఒక బీహార్ కూలీ తీవ్రంగా గాయపడ్డాడు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, హైవే నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో ట్రాక్టర్ ద్వారా నిర్మాణ సామగ్రిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌కు ఎదురుగా, క్రింద వైపున రైతులు ఆరబోసిన మొక్కజొన్నలను తూర్పారపడం వల్ల దుమ్ము ఎగిసింది.

ఆ దుమ్ము ఒక్కసారిగా డ్రైవర్ కళ్లలో పడటంతో ఆయన అకస్మాత్తుగా బ్రేక్ వేయగా, ట్రాక్టర్ నియంత్రణ కోల్పోయి బ్రిడ్జి అంచున వేలాడుతూ నిలిచిపోయింది. దీంతో అక్కడికక్కడే ఆందోళనకర పరిస్థితి నెలకొంది.

ట్రాక్టర్ డ్రైవర్ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడినప్పటికీ, ట్రాక్టర్‌లో ఉన్న బీహార్‌కు చెందిన ఒక కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా, తమకు ఇంకా అధికారిక సమాచారం అందలేదని వారు తెలిపారు.