Elkathurthy రైతులపై వైర్ల దొంగల దెబ్బ.. ఎల్కతుర్తిలో ఆందోళన

Elkathurthy రైతులపై వైర్ల దొంగల దెబ్బ.. ఎల్కతుర్తిలో ఆందోళన

ఎల్కతుర్తి (Elkathurthy), ఆంధ్రప్రభ: వ్యవసాయ సీజన్ ప్రారంభమైన వేళ ఎల్కతుర్తి మండలంలో విద్యుత్ మోటార్ వైర్ల చోరీలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వరుసగా జరుగుతున్న చోరీలతో పంటలకు నీరు అందక నారుమడులు ఎండిపోతుండటంతో అన్నదాతలు రాత్రిళ్లు బావుల వద్ద కాపలా కాయాల్సిన పరిస్థితి నెలకొంది.

మండలంలో గత కొద్ది రోజులుగా సుమారు 50 మంది రైతులకు చెందిన వ్యవసాయ బావులు, బోర్ మోటార్‌లకు అమర్చిన విద్యుత్ వైర్లు దొంగల పాలైనట్లు రైతులు తెలిపారు. పంటల నీటి పారుదల కోసం ఉపయోగించే వైర్లను గుర్తు తెలియని దుండగులు రాత్రివేళల్లో కోసుకొని తీసుకెళ్తుండటంతో రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు.

ఒకసారి చోరీకి గురైన తర్వాత అప్పులు చేసి కొత్త వైర్లు ఏర్పాటు చేసుకున్నా, వాటినీ మళ్లీ దొంగలు తీసుకెళ్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోటార్లు పనిచేయకపోవడంతో పంటలకు నీరు అందక నారుమడులు ఎండిపోతున్నాయి.

బావుల వద్ద రైతుల రాత్రి కాపలా

చోరీలు పెరుగుతుండటంతో రైతులు పగలు పొలాల్లో పని చేసి, రాత్రి వేళల్లో బావులు, బోర్‌వెల్‌ల వద్దే కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనుమానాస్పద ముఠా సంచారం

బుధవారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో ఎల్కతుర్తి శివారులో ముగ్గురు సభ్యులతో కూడిన అనుమానాస్పద ముఠా సంచరించినట్లు గొర్లకాపరులు గుర్తించారు. వారిని ప్రశ్నించగా బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో వైర్ల చోరీలకు ఇదే ముఠా కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బాధితులు వీరే..

బొజ్జ నవీన్, అంబాల రాజమౌళి, గొడిశాల సదానందం, గొడిశాల రాజు (ఉప సర్పంచ్), గొడిశాల యాదగిరి గౌడ్, కందుకూరి రాజు, ఎర్రబెల్లి మోహన్‌రావు (కౌలు రైతు), మాటూరి భిక్షపతి, అంబాల మహేష్, మండ యాదగిరి, ముద్దరబోయిన రాజయ్య, సంజీవరావు, నయీమొద్దీన్, దాట్ల సుధాకర్, పొలాటి చిట్టిబాబు తదితర రైతులకు చెందిన మోటార్ వైర్లు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు.

గ్రామ శివార్లలో రాత్రి గస్తీని పెంచాలని, చోరీలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు పోలీసులను కోరుతున్నారు.

Leave a Reply