కంటి చూపే సురక్షిత ప్రయాణానికి మూలం

కంటి చూపే సురక్షిత ప్రయాణానికి మూలం
- సురక్షిత ప్రయాణానికి కంటి చూపు ప్రధానం
- 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా రోడ్డు భద్రతా శిబిరం
- నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ పోలీస్ పరేడ్ మైదానంలో 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా నిర్వహిస్తున్న అరైవ్ – అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆటో డ్రైవర్లు, స్కూల్ బస్ డ్రైవర్లు, ఇతర వాహనదారులకు కంటి చూపు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ,…….. రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక పరిణామాలకు దారి తీస్తుందని, కంటి చూపు బాగా ఉంటేనే సురక్షిత ప్రయాణం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని, ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితి కూడా రోడ్డు భద్రతలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు. కంటి చూపు సరిగా లేకపోవడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అందుకే ఇలాంటి కంటి పరీక్ష శిబిరాలు నిర్వహించడం ఎంతో అవసరమని తెలిపారు. డ్రైవర్లు తమ ఆరోగ్యాన్ని నిరంతరం పరీక్షించుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కంటి చూపు ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమని, ముఖ్యంగా వాహనదారులు ప్రతి 6 నెలలకు ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అవసరమైన వారు కచ్చితంగా కళ్లజోళ్లు ఉపయోగించాలని, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని కోరారు. ముఖ్యంగా యువత ట్రాఫిక్ నియమాలను నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతతో వాహనాలు నడపాలని సూచించారు. రోడ్డు మీద క్రమశిక్షణ పాటించడం ద్వారా మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రక్షించగలమని అన్నారు. ప్రజలు ఆరోగ్యంగా, సురక్షితంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.
అలాగే వాహనదారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం అత్యంత అవసరమని, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం, వాహన వేగ నియంత్రణ, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకపోవడం వంటి ప్రాథమిక భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించాల్సిన అవసరాన్ని కూడా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గుర్తు చేశారు.
“అరైవ్–అలైవ్” వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో సురక్షిత ప్రయాణంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని ఆయన చెప్పారు. ప్రతి వ్యక్తి స్వీయ క్రమశిక్షణ పాటిస్తేనే రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే ప్రాణనష్టం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ట్రాన్స్‌పోర్ట్ విభాగ అధికారులు, పెద్ద సంఖ్యలో డ్రైవర్లు పాల్గొన్నారు. అధికారులు డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడంతో పాటు, భద్రతా ప్రమాణాలపై వివరణ ఇచ్చారు.
ప్రజలు పోలీస్ శాఖ, ఆరోగ్యశాఖ సూచనలను పాటిస్తూ రోడ్డు భద్రతకు సహకరించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. సమాజం మొత్తం కలిసి కృషి చేస్తేనే ప్రమాదాలను తగ్గించి సురక్షిత వాతావరణాన్ని సృష్టించవచ్చని ఆయన ఆకాంక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్… స్వయం గా డ్రైవర్ లకు అక్షరాలను గుర్తించడం లో ఉన్న కంటి సామర్ధ్యన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి రామేశ్వర్, డి.ఎస్.పి శ్రీనివాసులు, డిఎంహెచ్వో డాక్టర్ రవి నాయక్ ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల వైద్యులు తదితరులు పాల్గొన్నారు .
