టీడీపీ పొలిట్ బ్యూరోలో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు

టీడీపీ పొలిట్ బ్యూరోలో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు

ఎంపిక లభించిన అరుదైన గౌరవం
సేవా ప్రస్థానం నుంచి అత్యున్నత స్థాయికి ఎదుగుదల

చిత్తూరు, ఆంధ్రప్రభ : రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావుకు తెలుగుదేశం పార్టీ అత్యున్నత నిర్ణయాధికార మండలి అయిన పొలిట్ బ్యూరోలో స్థానం లభించింది. ఈ మేరకు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. రాజకీయాల్లో అనూహ్యంగా అడుగుపెట్టి, భారీ మెజారిటీతో ఎంపీగా విజయం సాధించిన దగ్గుమళ్లకు ఈ పదవి దక్కడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.

రాజకీయాల్లోకి అడిగిన ఐఆర్ఎస్ అధికారి ఆయన దగ్గుమల్ల ప్రసాదరావు మొదటిసారి చిత్తూరు పార్లమెంటు సభ్యునిగా పోటీ చేసి భారీ మెజారిటీ గెలుపొందారు. ఆయన 2024 జూన్ 22న లోక్‌సభలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నియమితుడయ్యాడు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను జిల్లా ప్రజలు ముఖ్యంగా మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన పార్లమెంటు వేదికగా ప్రశ్నించారు.

మొట్టమొదటిసారిగా పార్లమెంటేరియన్ గా ఎన్నికైనా, తన ప్రతిభ చేత పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మన్ననలు చూరగున్నారు. పార్టీలో పొలిట్ బ్యూరో అనేది అత్యున్నత స్థాయి నిర్ణయక వేదికగా పరిగణించబడుతుంది. పార్టీ విధానాలు, రాజకీయ వ్యూహాలు, ఎన్నికల నిర్ణయాలు వంటి కీలక అంశాలన్నింటినీ ఈ మండలి నిర్ణయిస్తుంది. అలాంటి ప్రతిష్టాత్మక వేదికలో దగ్గుమళ్ల ప్రసాదరావు చోటు సంపాదించడం ఆయన రాజకీయ ప్రస్థానానికి పెద్ద మైలురాయిగా నిలిచింది.

దగ్గుమళ్ల ప్రసాదరావు రాజకీయాల్లోకి వచ్చిన తీరు విశేషమైనది. సుదీర్ఘకాలం ఆదాయపు పన్ను శాఖలో ఉన్నతాధికారిగా సేవలందించిన ఆయన, హైదరాబాద్ నుంచి పూణే వరకు పలు కీలక కేంద్రాల్లో పనిచేశారు. హోదా, ఆర్థికంగా ఎలాంటి కొరతలేని పరిస్థితుల్లోనూ, ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ముందుగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. చిన్ననాటి నుంచే సేవాభావం కలిగిన ఆయన, స్వగ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం, లైబ్రరీ ప్రారంభించడం, పేదలకు ఆర్థిక సహాయం చేయడం వంటి కార్యక్రమాల ద్వారా సామాజిక సేవలో మునిగిపోయారు.

రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేకపోయినా, ప్రజలకు మరింత విస్తృత స్థాయిలో సేవ చేయాలంటే రాజకీయ రంగమే సరైన వేదిక అన్న భావన ఆయనలో బలపడింది. పార్టీ ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించిన దగ్గుమళ్ల, చివరికి చంద్రబాబు నాయుడు విజన్‌కి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరారు. మొదట బాపట్ల నుంచి పోటీ చేయాలనుకున్నా, పార్టీ నిర్ణయంతో చిత్తూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి దిగారు. చిత్తూరు ఆయనకు కొత్త ప్రాంతం.

నాయకులు, ప్రజలు ఎవరూ పరిచయం లేని పరిస్థితుల్లోనే ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే సమస్యలను లోతుగా అధ్యయనం చేసి రూపొందించిన స్పష్టమైన ఎన్నికల ప్రణాళిక ఆయనకు పెద్ద బలమైంది. విద్య, తాగునీరు, పరిశ్రమలు, రైతు సంక్షేమం వంటి అంశాలను ప్రధానంగా తీసుకుని ప్రజల్లోకి వెళ్లడంతో విపరీతమైన ఆదరణ లభించింది. చివరకు ఆయన రెండు లక్షల 20 వేల పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు.

ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా దగ్గుమళ్ల తన చురుకుదనాన్ని కొనసాగిస్తున్నారు. పార్లమెంట్‌లో చిత్తూరు అభివృద్ధికి సంబంధించిన అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా మామిడి రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. టీటీడీ ద్వారా మామిడి గుజ్జు కొనుగోలు చేయాలన్న అంశాన్ని కూడా ప్రస్తావించారు.

ఇదే సమయంలో పాకాల కాట్పాడి రైల్వే లైన్ వేగవంతం, గ్రామీణ రహదారుల నిర్మాణం, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై గట్టిగా వాదించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళాల నిర్వహణ, పరిశ్రమల స్థాపన వంటి అంశాలను ముందుకు తెచ్చారు. మహిళా సాధికారత విషయంలో స్వయం సహాయక సంఘాలకు మరింత ఆర్థిక బలం కల్పించాలని పార్లమెంట్‌లో ప్రశ్నించారు.

ఇక టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడిగా దగ్గుమళ్లపై మరింత బాధ్యతలు పడనున్నాయి. ఈ మండలి పార్టీకి థింక్ ట్యాంక్ లాంటిది. ప్రభుత్వ విధానాలపై పార్టీ వైఖరిని నిర్ణయించడం, ఎన్నికల వ్యూహాలను రూపొందించడం, ఇతర పార్టీలతో పొత్తులపై తుది నిర్ణయాలు తీసుకోవడం వంటి కీలక బాధ్యతలు ఈ కమిటీదే.

పార్టీ మేనిఫెస్టో రూపకల్పన నుంచి రాజకీయ మార్గదర్శకత్వం వరకు ప్రతి అంశంలో పొలిట్ బ్యూరో కీలక పాత్ర పోషిస్తుంది. పార్టీ క్రమశిక్షణను కాపాడటం, జిల్లాల వారీగా పార్టీ బలోపేతానికి మార్గనిర్దేశం చేయడం కూడా ఈ మండలి బాధ్యతల్లో భాగం. ముఖ్యంగా అధినేతకు సలహాలు ఇవ్వడంలో పొలిట్ బ్యూరో కీలకంగా వ్యవహరిస్తుంది. అందువల్ల ఈ కమిటీలో చోటు దక్కడం అంటే పార్టీలో అత్యున్నత గౌరవంగా భావిస్తారు.

దగ్గుమళ్ల ప్రసాదరావు వంటి కొత్త నాయకుడికి ఇలాంటి ప్రతిష్టాత్మక బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ ఆయనపై ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేసినట్టే. రాజకీయాల్లో అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, పరిపాలనా అనుభవం, సేవా దృక్పథం, ప్రణాళికాబద్ధమైన ఆలోచన ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. భారీ మెజారిటీతో గెలిపించిన చిత్తూరు ప్రజలకు కృతజ్ఞతగా, వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని దగ్గుమళ్ల ఇప్పటికే ప్రకటించారు.

తాగునీటి సమస్య, నిరుద్యోగం, రైతుల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పనిచేస్తానని తెలిపారు. ఇప్పుడీ పొలిట్ బ్యూరో సభ్యత్వం ఆయనకు మరింత రాజకీయ బలం ఇవ్వనుంది. చిత్తూరు వాణిని రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరింత బలంగా వినిపించే అవకాశాన్ని కల్పించనుంది. సాధారణ సేవా కార్యక్రమాలతో ప్రారంభమైన దగ్గుమళ్ల ప్రస్థానం, ఇప్పుడు టిడిపి అత్యున్నత వేదిక వరకు చేరడం ఆయన కృషి, నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది.

Leave a Reply