5 Fruits | ఎప్పుడు పడితే అప్పుడు తింటేనే చిక్కు!

5 Fruits | ఎప్పుడు పడితే అప్పుడు తింటేనే చిక్కు!
5 Fruits | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : “రోజుకో యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు” – అనే మాట మనం చిన్నప్పటి నుంచి వింటున్నదే. పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నది ఎంత నిజమో, వాటిని సరైన సమయంలో, సరైన పద్ధతిలో తినాలన్నది కూడా అంతే నిజం. లేదంటే అమృతం కావాల్సింది కాస్తా అనారోగ్యానికి హేతువు అవుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు పండ్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే.
అసలు ఏ పండు ఎప్పుడు తినాలి? భోజనానికి ముందు తినాలా? తర్వాత తినాలా?
భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే జాగ్రత్త!
చాలామందికి భోజనం చేయగానే ఒక అరటిపండో లేదా మామిడి పండు ముక్కో తినడం అలవాటు. నిజానికి ఇది అన్నిటికంటే పెద్ద తప్పు. మనం భోజనం చేసినప్పుడు అది అరగడానికి సమయం పడుతుంది. భోజనం వెంటే పండ్లు తింటే, పండ్లు త్వరగా జీర్ణమైపోతాయి కానీ భోజనం అరగక పోవడంతో ఈ పండ్లు కడుపులోనే ‘ఫెర్మెంటేషన్’ (పులిసిపోవడం)కు గురవుతాయి. దీనివల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.

సరైన సమయం ఎప్పుడంటే.. భోజనానికి గంట ముందు లేదా భోజనం చేసిన రెండు గంటల తర్వాత పండ్లు తినడం ఉత్తమం.

పరగడుపున పండ్లు తింటే ఏమవుతుందంటే, ఉదయాన్నే పరగడుపున పండ్లు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. విటమిన్లు, మినరల్స్ నేరుగా రక్తంలోకి చేరుతాయి. అయితే ఇక్కడ ఒక చిన్న మినహాయింపు ఉంది. నిమ్మ, నారింజ, బత్తాయి వంటి ‘సిట్రస్’ పండ్లను పరగడుపున తినకపోవడమే మంచిది. ఇవి ఖాళీ కడుపులో యాసిడ్ స్థాయిని పెంచి కడుపులో మంటను కలిగిస్తాయి. యాపిల్, పుచ్చకాయ వంటివి ఉదయాన్నే తీసుకోవడానికి మేలైనవి.
మధుమేహం ఉన్నవారు పండ్లు తినకూడదు అనేది ఒక అపోహ మాత్రమే. కానీ వారు పండ్ల ‘గ్లైసీమిక్ ఇండెక్స్’ గమనించాలి.
మామిడి, అరటి, సపోటా, ద్రాక్ష, సీతాఫలాల్లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. లేదా దూరంగా ఉంచాలి.

మంచి ఫలితాలనిచ్చేవి – జామ, నేరేడు, పుచ్చకాయ, బొప్పాయి, యాపిల్స్ డయాబెటిక్ పేషెంట్లకు చాలా మంచివి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండి చక్కెర నిదానంగా రక్తంలోకి చేరుతుంది.
చాలామంది బరువు తగ్గడానికి రాత్రి భోజనం మానేసి కేవలం పండ్లు తింటారు. ఇది సరైన పద్ధతి కాదు. పండ్లలో ఉండే ‘ఫ్రక్టోజ్’ చక్కెరను పెంచుతుంది. పడుకునే ముందు పండ్లు తింటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగి నిద్రకు భంగం కలగవచ్చు. పైగా రాత్రి పూట జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది కాబట్టి అజీర్తి చేసే అవకాశం ఉంది.
పండ్లను ఎప్పుడూ ముక్కలుగా కోసుకుని తినడమే శ్రేయస్కరం. జ్యూస్ తాగడం వల్ల అందులోని ఫైబర్ (పీచు పదార్థం) కోల్పోతాం. పీచు లేని పండు చక్కెరను వేగంగా పెంచుతుంది.


ఏ పండైనా ప్రకృతి ప్రసాదించిన వరమే. కానీ అది మనకు వరం కావాలా లేక శాపం కావాలా అనేది మనం తినే సమయం, మన ఆరోగ్య పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ డైట్ లో పండ్లను చేర్చుకునే ముందు ఈ చిన్న మార్పులు చేసుకోండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి!
గమనిక ” ఈ వ్యాసం కేవలం పాఠకులకు ప్రాధమిక అవగాహన కలిగించేందుకోసం మాత్రమే అందించబడుతోంది
