5 Simptoms | లైట్ తీసుకోవద్దు..

5 Simptoms | లైట్ తీసుకోవద్దు..
5 Simptoms | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : ముప్పై ఏళ్లు.. ఒక మహిళ జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. ఇటు కెరీర్, అటు కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకం.. ఇలా నిరంతరం ఉరుకులు పరుగుల జీవితం. ఈ క్రమంలో మహిళలు చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే.. అందరి ఆరోగ్యం గురించి పట్టించుకుంటూ, తమ శరీరం ఇచ్చే హెచ్చరికలను, కొన్ని రకాల అనారోగ్య సూచనలను పట్టించుకోక పోవడం, నిర్లక్ష్యం చేయడం.
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, 30 ఏళ్ల తర్వాత మహిళల శరీరంలో హార్మోన్ల మార్పులు మొదలవుతాయి. అందుకే, ఈ క్రింది 5 లక్షణాలు కనిపిస్తే వాటిని సాధారణ అలసటగా భావించి వదిలేయకుండా, వెంటనే స్పందించడం, తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అవేంటో ఇప్పుడు చూద్దాం.

- అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం..
తినే ఆహారం, దినచర్య లాంటి వాటిలో ఎలాంటి మార్పులు చేయకపోయినా అకస్మాత్తుగా బరువులో విపరీతమైన హెచ్చు-తగ్గులు కనిపిస్తే అది కేవలం తినడం-తినకపోవడం వల్ల వల్ల వచ్చే మార్పు కాదని గుర్తించాలి.. ముఖ్యంగా పొత్తికడుపు భాగంలో బరువు పెరగడం థైరాయిడ్ సమస్యకు లేదా ‘పిసిఓఎస్’ కి సంకేతం కావచ్చు. మెటబాలిజం రేటు తగ్గడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. దీన్ని కేవలం వ్యాయామంతో సరి చేయలేం, వెంటనే వైద్యులను సంప్రదించడం, హార్మోన్ల పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.

- ఏ పని చేసినా, చేయకున్నా, ఎప్పుడూ అలసటగా అనిపించడం..
రోజంతా పని చేసి అలసిపోవడం వేరు, నిద్ర లేచినప్పటి నుండి నీరసంగా ఉండటం వేరు. తగినంత విశ్రాంతి తీసుకున్నా కూడా శరీరం సహకరించడం లేదంటే.. అది రక్తహీనత లేదా విటమిన్ డి, విటమిన్ బి12 లోపాలకు ప్రధాన సంకేతం. మన దేశంలో 30 ఏళ్లు దాటిన మహిళల్లో ఎక్కువ మంది రక్తహీనతతో బాధ పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
- రుతుక్రమంలో మార్పులు ..

నెలసరి సమయం మారడం, రక్తస్రావం అతిగా అవ్వడం, లేదా చాలా తక్కువగా అవ్వడం వంటివి గుర్తిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు లేదా హార్మోన్ల అసమతుల్యతకు చిహ్నాలు. భవిష్యత్తులో గర్భధారణ సమస్యలు(అప్పటికే పిల్లలు పుట్టడం అయిపోతే, ఇతర గర్భాశయ సమస్యలు) రాకుండా ఉండాలంటే ప్రారంభంలోనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం ముఖ్యం.
- విపరీతంగా జుట్టు రాలడం, మరియు చర్మంపై మార్పులు..
వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంపై ముడతలు రావడం సహజం, కానీ 30లలోనే హఠాత్తుగా మొటిమలు రావడం, జుట్టు పల్చబడటం లేదా ముఖంపై అనవసరమైన జుట్టు పెరగడం వంటివి ‘ఆండ్రోజెన్’ అనే హార్మోన్ పెరగడం వల్ల జరుగుతాయి. ఇది లోపల ఏదో అనారోగ్యం దాగి ఉందని శరీరం చేసే హెచ్చరికగా భావించాలి..

- మానసిక ఒత్తిడి మరియు మూడ్ స్వింగ్స్..
చిన్న చిన్న విషయాలకే చిరాకు పడటం, ఏడుపు రావడం లేదా తీవ్రమైన ఆందోళన కలగడం కేవలం పని ఒత్తిడి వల్ల మాత్రమే కాదు. శరీరంలోని ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలలో మార్పులు రావడం వల్ల ఇలా జరుగుతుంది. ఇది మానసిక, శారీరక ఆరోగ్యంతో ముడిపడి ఉంటుందని గుర్తించాలి.
“ముప్పై ఏళ్ల తర్వాత ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.”
ఏటా ఒకసారి ‘మాస్టర్ హెల్త్ చెకప్’ చేయించుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం, కనీసం 30 నిమిషాల నడకను అలవాటు చేసుకోవడం వల్ల రాబోయే పెద్ద పెద్ద అనారోగ్యాలను ముందుగానే అరికట్టవచ్చు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది.

CLICK HERE TO READ MORE : Breast cancer | భారత్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ పరిస్థితి మరియు గణాంకాలు..
