‘స్నానానికి కూడా నీళ్లు లేవు’.. గురుకులాల్లో విద్యార్థుల ఆందోళన

మంచినీటి కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

హాస్టళ్లలో దయనీయ పరిస్థితులపై అధికారుల నిర్లక్ష్యమంటూ ఆవేదన

మహబూబాబాద్, ఆంధ్రప్రభ: “చదువుకోవడానికి గురుకులంలో చేరాం.. కానీ కనీసం స్నానం చేయడానికి కూడా నీళ్లు లేవు” అంటూ గురుకుల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్‌తో పాటు వరంగల్, ఇతర ప్రాంతాల్లోని పలు గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో తీవ్రమైన మంచినీటి కొరత నెలకొనడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు.

హాస్టళ్లలో తాగునీటితో పాటు స్నానానికి, బాత్రూమ్‌ల నిర్వహణకు కూడా సరిపడా నీరు అందడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రోజువారీ అవసరాలు తీర్చుకోవడమే కష్టంగా మారిందని, కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోతున్నారు.

సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి పరిష్కారం లభించలేదని ఆరోపిస్తూ, పలు ప్రాంతాల్లో విద్యార్థినులు రోడ్డెక్కి ధర్నాలు చేపట్టారు. తక్షణమే మంచినీటి సమస్యను పరిష్కరించి, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

విద్యార్థుల ఆందోళనతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. “చదువుపై దృష్టి పెట్టాల్సిన సమయంలో నీటి కోసం పోరాడాల్సి వస్తోందని” విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను అధికారులు స్వయంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

గురుకుల విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి కల్పించాలనే లక్ష్యంతో పలు కార్యక్రమాలు అమలు చేస్తుండగా, క్షేత్రస్థాయిలో మాత్రం కనీస అవసరాలే అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నీటి సమస్యను వెంటనే పరిష్కరించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.