కాంగ్రెస్‌లో మళ్లీ కలహాలా..?

కాంగ్రెస్‌లో మళ్లీ కలహాలా..?

బస్సు సెంటర్ ప్రారంభోత్సవంలో చిచ్చు..
వనపర్తిలో రాజకీయ వేడి ఇంకా రగులుతుందా…
?

వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ : వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో గోనూరు వెంకటయ్య తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిర్మించిన బస్సు సెంటర్ ప్రారంభోత్సవం రాజకీయంగా చర్చనీయాంశమైంది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమాన్ని మంత్రి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే మెగా రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గోనూరు వెంకటయ్య మాట్లాడుతూ, తమ కీర్తిశేషులైన తల్లిదండ్రులు, భార్య స్మారకార్థంగా ఈ బస్సు సెంటర్ నిర్మించాలని చాలా కాలంగా కలగన్నానని, ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వం అనుమతి ఇవ్వడం తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నారు.

అయితే ఈ కార్యక్రమంలో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి ముందుగానే కార్యక్రమ స్థలానికి చేరుకుని, గంటకు పైగా వేచి చూశారు. కానీ మంత్రి, ఎమ్మెల్యే రాక ఆలస్యం కావడంతో తీవ్ర అసంతృప్తితో అక్కడి నుంచి వెనుదిరిగినట్లు సమాచారం.ఈ ఘటన వనపర్తి పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ నాయకుల మధ్య సమన్వయం లోపిస్తున్నదా..? అంతర్గత విభేదాలు మళ్లీ బయటపడుతున్నాయా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ కార్యక్రమాల్లోనే నాయకుల మధ్య అసమన్వయం బయటపడటం, ముఖ్య నేతలు నిరాశతో వెళ్లిపోవడం పార్టీకి నష్టం కలిగించే పరిణామమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్‌లో వర్గ పోరు మళ్లీ తలెత్తిందా అన్న సందేహాలు వ్యక్తమవుతుండగా, ఈ సంఘటన ఆఅనుమానాలకు మరింత బలం చేకూర్చింది.

Leave a Reply