Inspections | టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలపై ఫోకస్
Inspections | టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలపై ఫోకస్
Inspections | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో పలు విభాగాల్లో తనిఖీలు చేపట్టారు.
గత కొంతకాలంగా మున్సిపల్ కార్యాలయంలోని పలు విభాగాలపై భారీ అవినీతి ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు ప్రారంభించారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

ప్లాన్ల అనుమతులు, నిబంధనల ఉల్లంఘనలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే రెవెన్యూ శాఖలో పన్నుల వసూళ్లు, శానిటేషన్ విభాగంలో అవినీతి అంశాలపై కూడా అధికారులు లోతుగా విచారణ చేపట్టారు.
తనిఖీల సందర్భంగా మున్సిపల్ సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకుని, కీలక పత్రాలు, ఫైళ్లను పరిశీలిస్తున్నారు. లావాదేవీలపై వివరాలు సేకరిస్తూ మరింత సమాచారం రాబడుతున్నారు. ఏసీబీ అధికారుల రాకతో మున్సిపల్ కార్యాలయంలో కలకలం రేగగా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిలో ఆందోళన నెలకొంది. ఈ కేసులో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
