మోటర్ ఆన్ చేయడానికి వెళితే..
మోటర్ ఆన్ చేయడానికి వెళితే..
మోత్కూర్, ఆంధ్రప్రభ : వ్యవసాయ పొలం వద్ద ఓ రైతు మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ ఘాతంతో ఆ రైతు మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలోని పాటిమట్ల గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దొండ కొమరయ్య (65) తనకున్న 2 ఎకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవల నెల రోజుల క్రితం పంటను కాపాడుకునే క్రమంలో కొమురయ్య కొత్తగా బోర్ వేసి మోటార్ సైతం బిగించాడు. వ్యవసాయ బావి వద్ద దొంగలు సబ్ మెర్సిబుల్ మోటార్ ను ఎత్తుకెళ్లడంతో మళ్లీ కొత్త మోటర్ తెచ్చి బిగించారు. మోటర్ కనెక్షన్ ఇచ్చే సమయంలో వైర్లు ఇనుప కడ్డీకి అనుకోని ఉన్నాయి.
దీనిని గమనించకపోవడంతో ఆదివారం సుమారు 4 గంటలకు తెల్లవారుజామున వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన కొమురయ్య మోటార్ ఆన్ చేసి నీళ్లు వస్తుందో లేదో అని చూస్తున్న క్రమంలో ఆ కడ్డీలను పట్టుకున్న రైతు కొమురయ్యకు ఒక్కసారిగా షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చేతికి అంది వచ్చిన పంటను కాపాడుకునే క్రమంలో రైతు కొమురయ్య ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో, గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడు కొమురయ్యకి భార్య కలమ్మ, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు కృష్ణ ఆర్టీసీలో కండక్టర్ గా పని చేస్తున్నాడు. ఎస్సై సతీష్ కుమార్ సంఘటన స్థలానికి వెళ్లి పంచనామ నిర్వహించి, కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా హాస్పిటల్ తరలించారు. విద్యుత్ షాక్ తో మృతి చెందిన నిరుపేద రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక సర్పంచ్ బండ రమ విజయ్ రెడ్డి కోరారు.
