ప్ర‌తి ఇంట్లో సూర్య‌ఘ‌ర్ వెలుగులు నింపుదాం…

ప్ర‌తి ఇంట్లో సూర్య‌ఘ‌ర్ వెలుగులు నింపుదాం…

  • పీఎం సూర్య‌ఘ‌ర్ పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచాలి
  • సూర్యాంధ్ర ప్ర‌గ‌తి శ‌క‌టాలతో జన‌జాగృతికి శ్రీకారం
  • మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
  • కేతనకొండలో సౌర విద్యుత్ కనెక్షన్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: సౌరశక్తి వినియోగంపై ప్ర‌జ‌ల‌ను ప్రోత్సహిస్తూ ప్ర‌తి ఇంట్లో సూర్య‌ఘ‌ర్ వెలుగులు నింపుదామ‌ని, పీఎం సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచేందుకు సూర్యాంధ్ర ప్ర‌గ‌తి శ‌క‌టాల ద్వారా విస్తృత ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కేతనకొండలో పలు గృహాలపై అమర్చిన సౌర విద్యుత్ ఫలకాలను ఎమ్మెల్యే శనివారం పరిశీలించారు. నేష‌న‌ల్ సోలార్ ఎన‌ర్జీ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈఎఫ్ఐ) – సూర్యాంధ్ర ప్ర‌గ‌తి ర‌థ శ‌క‌టాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

పలువురు లబ్ధిదారులు ఇళ్లకు అమర్చిన నూతన సోలార్ విద్యుత్ కనెక్షన్లను ప్రారంభించారు. వారితో మాట్లాడి సౌరవిద్యుత్ వల్ల కలిగే లాభాలను వివరించారు. ఈ సంద‌ర్భంగా వినియోగదారులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సూర్య ఘర్ యోజన పథకంతో విద్యుత్ బిల్లుల నుంచి విముక్తి ల‌భించ‌డంతో పాటు ప‌ర్యావ‌ర‌ణ హితానికి ఈ ప‌థ‌కం దోహ‌దం చేస్తుంద‌న్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేయూత‌తో అమ‌ల్లో ఉన్న పీఎం సూర్య‌ఘ‌ర్ – ముఫ్త్ బిజ్లీ యోజ‌న ప‌థ‌కం ద్వారా 60 శాతం వ‌ర‌కు రాయితీతో సోలార్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసుకొని విద్యుత్ వినియోగ‌దారులు ఉత్ప‌త్తిదారులుగా మారొచ్చ‌న్నారు.

ఇంటి అవ‌స‌రాల‌కు ఉప‌యోగించుకోగా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అమ్మ‌డం ద్వారా అద‌న‌పు ఆదాయం కూడా పొంద‌వ‌చ్చని చెప్పారు. విద్యుత్ స్వ‌యం స‌మృద్ధితో విద్యుత్ కొనుగోలుపై ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఇంటి య‌జ‌మానులు, అపార్టుమెంట్లు, హౌసింగ్ సొసైటీలు, చిన్న‌, మ‌ధ్య‌ త‌ర‌హా వ్యాపార‌స్తులు, రైతులు ప‌థ‌కానికి అర్హుల‌ని వివ‌రించారు. ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకునేలా ప్రోత్స‌హించేందుకు ఎన్ఎస్ఈఎఫ్ఐ – సూర్యాంధ్ర ప్ర‌గ‌తి ర‌థాల ద్వారా గ్రామాల్లో విస్తృత అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు వివ‌రించారు.

ఈ రథం ద్వారా పీఎం సూర్యఘర్ పథకం ప్రయోజనాలు, దరఖాస్తు విధానం, సబ్సిడీ వివరాలు ప్రజలకు తెలియజేస్తున్నట్లు వివరించారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్ చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), టీడీపీ మండల అధ్యక్షుడు పెదర్ల రవి తదితరులు పాల్గొన్నారు.