రోశయ్య సేవలు చిరస్మరణీయం: సుజనా చౌదరి

భవానిపురం, ఆంధ్రప్రభ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత కొణిజేటి రోశయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కొనియాడారు. శనివారం ఆయన జయంతి సందర్భంగా వాసవి ఫౌండేషన్, విజయవాడ ఆధ్వర్యంలో భవానీపురంలో నిర్వహించిన జయంతి వేడుకలకు సుజనా చౌదరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై రోశయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ రోశయ్య ఆర్థిక క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచిన నాయకుడని అన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక బడ్జెట్లను ప్రవేశపెట్టి ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ప్రజా ధనాన్ని అత్యంత బాధ్యతాయుతంగా వినియోగిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సమర్థంగా నడిపించారని కొనియాడారు. ఆయన మరికొంతకాలం ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని సేవలు అందించేవారని అభిప్రాయపడ్డారు. రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, నేటి రాజకీయ నాయకులు ఆయన హుందాతనం, ప్రసంగ శైలి, విలువలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ రోశయ్య పరిణితి చెందిన రాజకీయ నాయకుడని, సిద్ధాంతపరంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత విమర్శలకు తావివ్వకుండా హుందాగా వ్యవహరించేవారని అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా దాదాపు 15 సంవత్సరాల పాటు ఓవర్‌డ్రాఫ్ట్ లేకుండా ప్రభుత్వాన్ని నడిపించిన ఘనత సాధించారని గుర్తుచేశారు. అనంతరం యూపీఏ ప్రభుత్వం తమిళనాడు గవర్నర్‌గా నియమించగా ఆ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందారని తెలిపారు. ప్రజాసేవలో నిజాయితీ, అంకితభావం, పరిపాలనా నైపుణ్యం కలిగిన నాయకుడిగా రోశయ్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీ నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఎస్. బేగ్, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు పెనుగొండ సుబ్బారాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు కోగంటి రామారావు, వాసవి ఫౌండేషన్ చైర్మన్ వీ.వి.కే. నరసింహారావు, జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్, మాజీ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర, గడ్డం రవికుమార్, కొణిజేటి రమేష్, కొప్పురావూరి రజిని తదితరులు పాల్గొని రోశయ్యకు ఘన నివాళులు అర్పించారు.