జిల్లా కేంద్రంలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ ; ఐపీఎల్ క్రికెట్‌ను ప్రత్యక్షంగా స్టేడియంలో వీక్షించాలని అభిమానులందరికీ ఆసక్తి ఉంటుందని, అయితే అందరికీ ఆ అవకాశం దక్కదని బీసీసీఐ ఆపరేషన్ మేనేజర్ వికాస్ పండిట్ తెలిపారు. స్టేడియంలోకి వెళ్లి చూడలేని అభిమానుల కోసం దేశవ్యాప్తంగా 50 నగరాల్లో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్‌లను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ వివరాలను వెల్లడించారు.
జిల్లా కేంద్రంలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేయడం ఇది నాలుగోసారి అని ఆయన పేర్కొన్నారు. అభిమానులు ఎటువంటి ప్రవేశ రుసుము లేకుండా స్టేడియం తరహా అనుభూతిని పొందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పెద్ద ఎల్‌ఈడి బిగ్ స్క్రీన్‌పై మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయడంతో పాటు కుటుంబ సమేతంగా వచ్చి ఆనందించేందుకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నట్లు వివరించారు. ఫ్యాన్ పార్క్‌లో ప్రేక్షకుల కోసం ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఆహార పదార్థాలను అందరికీ అందుబాటులో ఉండేలా రూ.100 లోపు ధరలతో విక్రయించేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. శని, ఆదివారాల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను బిగ్ స్క్రీన్‌పై ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా అభిమానులకు ఉత్సాహభరిత వాతావరణం కల్పిస్తామని పేర్కొన్నారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఈ అవకాశాన్ని జిల్లా క్రీడా అభిమానులు, క్రీడాకారులు సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ వెంకట్ రెడ్డి, మేనేజర్ దీపక్ తదితరులు పాల్గొన్నారు.
