పీఎం జీవన్ జ్యోతి క్లెయిమ్ చెక్కు అందించిన ఎమ్మెల్యే

పీఎం జీవన్ జ్యోతి క్లెయిమ్ చెక్కు అందించిన ఎమ్మెల్యే

అవనిగడ్డ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో స్థానిక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు శాఖ లబ్ధిదారు లింగం చిన్నారికి రూ.రెండు లక్షల బీమా క్లెయిమ్ చెక్కును బ్యాంక్ అధికారులు ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఈ పథకంలో కేవలం సంవత్సరానికి రూ.436 ప్రీమియం చెల్లించి చేరవచ్చని తెలిపారు. 18 నుండి 50 సంవత్సరాల వయస్సు లోపు వారు ఏ విధంగా మరణించినా, వారి కుటుంబానికి రూ.రెండు లక్షలు తక్షణ ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అవనిగడ్డ బ్రాంచ్ మేనేజర్ భూపతి ప్రదీప్ కుమార్, జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార విభాగ వికాసం కార్యదర్శి లంకె యుగంధర్, జనసేన పార్టీ అవనిగడ్డ మండల ప్రధాన కార్యదర్శి బచ్చు శ్రీహరి, సొసైటీ అధ్యక్షులు యలవర్తి చిన్నా, జనసేన పార్టీ మోదుముడి గ్రామ ఉపాధ్యక్షులు పెనుమాక రమేష్, పెనుమాక పసి, బడే సుబ్బారావు, గరికిపాటి హరిబాబు బ్యాంకు ఆఫీసర్ దాసరి నరేంద్ర, బ్రాంచ్ అసిస్టెంట్ ఎన్.శ్రీహరి, సిబ్బంది పాల్గొన్నారు.