సలేశ్వరం జాతరకు ఏప్రిల్ 1–3 వరకు ప్రత్యేక బస్సులు
నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ : తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం సలేశ్వరం జాతరకు భక్తుల సౌకర్యార్థం ఏప్రిల్ 1 నుండి 3వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఆకారపు యాదయ్య తెలిపారు.
ఆదివారం నాగర్ కర్నూల్ డిపోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భక్తులు సుఖవంతమైన మరియు సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని సూచించారు. ఈ మూడు రోజుల పాటు డిపో నుంచి సుమారు 25 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలిపారు.
ఏప్రిల్ 2న పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది సుమారు 15,000 మంది ప్రయాణికులు రానున్నారని అంచనా వేస్తున్నామని, గత సంవత్సరం సుమారు 12,000 మంది ప్రయాణించినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఈ పురాతన సలేశ్వరం క్షేత్రాన్ని దర్శించేందుకు తరలివస్తారని తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్ననూరు గ్రామానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో, నల్లమల్ల అటవీ ప్రాంతంలోని లోయలో గుహలో వెలసిన స్వయంభూ లింగాకార సలేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తాడని వివరించారు.
చరిత్రకారుల ప్రకారం, 1880 ప్రాంతంలో నిజాం పాలనలో కోత్వాల్ అధికారి ఏనాకిన్ దొర, అలాగే పోస్టుమాస్టర్ కందాల నరసింహాచారి ఈ క్షేత్రంలో పూజలు నిర్వహించారని తెలిపారు. అప్పటి నుంచి భక్తుల సంఖ్య క్రమంగా పెరిగి, ప్రస్తుతం పౌర్ణమి సందర్భంగా మూడు నుంచి ఐదు రోజుల పాటు వేలాదిమంది భక్తులు దర్శనానికి వస్తున్నారని చెప్పారు.
ఈ నేపథ్యంలో భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు యాదయ్య తెలిపారు. ఈ సందర్భంగా సలేశ్వరం జాతర కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ జోగమ్మ, ట్రాఫిక్ మేనేజర్ ఏడీసీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
