అమరావతి రాజధాని ఆంధ్రుల ఆకాంక్ష….

అమరావతి రాజధాని ఆంధ్రుల ఆకాంక్ష….

అప్పట్లో మూడు రాజధానులను వ్యతిరేకించాను.
అసెంబ్లీలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : అమరావతి రాజధాని ఆంధ్రుల ఆకాంక్ష అని, అప్పట్లో మూడు రాజధానుల నిర్ణయాన్ని తను వ్యతిరేకించానని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో సమావేశంలో అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై అసెంబ్లీలో శనివారం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ ఏపీ భవిష్యత్తును నిర్ణయించే చారిత్రక తీర్మానం అమరావతి రాజధానికి చట్టబద్ధత అన్నారు. 2019 నుంచి 24 వరకు అప్పట్లో దురదృష్టవశాత్తు తను కూడా ఎమ్మెల్యేగా ఉన్నానని అన్నారు.

అప్పట్లో ఇదే సభలో మూడు రాజధానుల గురించి ప్రస్తావించగానే భస్మాసురుడు తన నెత్తిన తనే చెయ్యి పెట్టుకుని నాశనం అయిన చందంగా ఇది జగన్ పతనానికి దారి తెస్తుందని చెప్పానన్నారు. ఇదిలా ఉంటే మూడు రాజధానులు అంశంపై జగన్మోహన్ రెడ్డి నివాసంలో కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు, ప్రముఖులతో జరిగిన సమావేశంలో కూడా తాను ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించానని అన్నారు. అమరావతిని చంపటం సరైన నిర్ణయం కాదని, ఇది వైసీపీని తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరించినట్లు వివరించారు.

2018లో కూడా వైసీపీలో చేరేముందు కూడా జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిలో మార్పు లేదని తను ఇల్లు ఇక్కడే కట్టుకుంటున్నానని, చంద్రబాబు కే ఇక్కడ సొంత ఇల్లు లేదని చెప్పారన్నారు. దీన్ని తను ఆ సమావేశంలో ప్రస్తావించగా అంబటి రాంబాబు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉండి ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తావా..? అని తనను వారించినట్లు పేర్కొన్నారు. మల్లాది విష్ణు కూడా తన నిర్ణయాన్ని ఏకీభవిస్తున్నట్లు సమర్ధించారని అన్నారు.

ఇదే సమావేశంలో ఇప్పటి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు , మంత్రి పార్థసారథి కూడా ఉన్నారని గుర్తు చేశారు. అమరావతిని రాజధానిని తరలించడానికి ససేమిరా అంగీకరీంచనని తన నిర్ణయాన్ని ఖరాఖండిగా తేల్చి చెప్పినట్లు స్పష్టం చేశారు. ఈ విషయంపై అదే రోజు సాయంత్రం తన తండ్రి వసంత నాగేశ్వరరావు కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని చెప్పారని అన్నారు.

కానీ అప్పట్లో తను రాజీనామా చేస్తే దీనిపై రెఫరెండెం పెట్టి జగన్మోహన్ రెడ్డి తనకున్న అధికార బలంతో, డబ్బుతో ఉపఎన్నికలో వేరే అభ్యర్థిని గెలిపిస్తే మళ్ళీ అమరావతికి తీవ్రనష్టం కలిగిస్తుందని, అందువల్లే తను రాజీనామా చేయలేదని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు స్పష్టం చేశారు. ఏపీలో ఉన్న డబ్బు అంతా ఊడ్చి పెట్టి అమరావతిని అభివృద్ధి చేస్తున్నారని అప్పట్లో చంద్రబాబు పై దుష్ప్రచారం చేశారని అన్నారు. ఒక దార్శనికుడిని నమ్మి 34వేల ఎకరాలు రైతులు ఆయన చేతిలో పెట్టారంటే సీఎం చంద్రబాబు విజనరీ, రైతులకు ఆయనపై ఉన్న నమ్మకానికి అద్దం పడుతోందన్నారు.

అమరావతి రాజధాని వల్ల రూ.14వేల కోట్ల కంటే మరింత ఎక్కువగా ఆదాయం వస్తుందన్నారు. తెలంగాణాకు హైదరాబాద్, తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగుళూరు తరహాలో నవ్యాంధ్రప్రదేశ్ కు అమరావతి నిలుస్తుందన్నారు. మూడు రాజధానులు అంటే ఒక అయోమయం అని, ఇది ఒక వంచన అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతో పరిశ్రమలు నెలకొల్పడంతో విస్తారంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, కేంద్రం సహకారంతో, కూటమి ప్రభుత్వ హయాంలో అమరావతి అభివృద్ధి చెందాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, రాజధాని రైతుల కలలు నెరవేరాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పేర్కొన్నారు.

Leave a Reply