Social Media | అవాస్తవ ప్రచారాలపై పూరి ఘాటు స్పందన
Social Media | అవాస్తవ ప్రచారాలపై పూరి ఘాటు స్పందన
Social Media | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశంలో ఇంధన కొరత కారణంగా లాక్డౌన్ విధిస్తారనే వార్తలు సోషల్ మీడియా, కొన్ని వార్తా వేదికల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ ప్రచారాలను పూర్తిగా ఖండిస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టత ఇచ్చారు.
ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సరఫరాపై కొంత ఆందోళన ఉన్నప్పటికీ, దేశంలో లాక్డౌన్ విధించే ఎలాంటి ఆలోచన లేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందించిన పూరి, ప్రజలు నిరాధార వార్తలను నమ్మవద్దని సూచించారు.
దేశంలో తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా వ్యవస్థలో ఎటువంటి అంతరాయం రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన భరోసా ఇచ్చారు. అనవసర భయాందోళనలకు లోనై పెట్రోల్ బంకుల వద్ద గుంపులు కట్టవద్దని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలను కోరారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ముందస్తు ప్రణాళికలతో చమురు నిల్వలను పర్యవేక్షిస్తున్నామని పూరి స్పష్టం చేశారు.
