Crime |ప్రభుత్వ భూమి ఆక్రమణకు నకిలీ పత్రాల అస్త్రం..!
- 11 మందిపై కేసు, 9 మంది అరెస్ట్
- తహసీల్దార్ సంతకాలు, అధికారిక ముద్రలు నకిలీ చేసినట్లు గుర్తింపు
- రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడి
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో: శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ రిజర్వుడ్ స్థలాన్ని నకిలీ ప్రభుత్వ పత్రాల ఆధారంగా అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు పన్నిన కుట్రను శ్రీకాకుళం రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం 11 మందిపై కేసు నమోదు చేయగా, వారిలో 9 మందిని అరెస్టు చేసినట్లు శ్రీకాకుళం రూరల్ సీఐ పైడిపు నాయుడు మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఎస్‌బీఐ స్టాఫ్ కాలనీ అధ్యక్షుడు పుప్పాల జగదీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.
11 మంది నిందితులపై కేసు…
ఈ కేసులో ఏ1 నుంచి ఏ5 వరకు శ్రీకాకుళం పట్టణంలోని బొండిలిపురం, ఎస్‌బీఐ కాలనీకి చెందిన వజ్జా కుటుంబ సభ్యులు నిందితులుగా ఉన్నారు. అలాగే ఏ6గా కొత్తూరు మండలానికి చెందిన తిర్లంగి లక్ష్మణరావు అలియాస్ మధు, ఏ7గా వంబరవెల్లి శ్రీనివాసరావు, ఏ8గా ఆమదాలవలసకు చెందిన ముండేటి సురేష్, ఏ9గా మోదలవలస వేణుగోపాలరావు, ఏ10గా శ్రీకాకుళానికి చెందిన కొసూరు మహేశ్వరరావు, ఏ11గా ఇచ్చాపురం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కారాపాటి అనిల్‌కుమార్‌లను నిందితులుగా చేర్చినట్లు తెలిపారు.
రిజర్వుడ్ స్థలాన్ని కాజేయాలన్న కుట్ర..
శ్రీకాకుళం పట్టణంలోని ఎస్‌బీఐ స్టాఫ్ కాలనీ లేఅవుట్‌లో ప్రజా అవసరాల కోసం రిజర్వ్ చేసిన సుమారు 11 సెంట్ల ప్రభుత్వ స్థలం ప్రస్తుతం సుమారు రూ.3 కోట్ల మార్కెట్ విలువ కలిగి ఉందని సీఐ తెలిపారు. ఈ స్థలాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు నిందితులు ముందస్తు ప్రణాళిక ప్రకారం కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
తహసీల్దార్‌తో పాటు ఇతర రెవెన్యూ అధికారుల పేర్లతో నకిలీ సంతకాలు, అధికారిక ముద్రలు ఉపయోగించి తప్పుడు పొజెషన్ సర్టిఫికెట్ రూపొందించినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. అనంతరం ఆ నకిలీ పత్రాల ఆధారంగా ప్రభుత్వ రిజర్వుడ్ స్థలాన్ని అక్రమంగా బదిలీ చేసేందుకు సేల్ డీడ్ సిద్ధం చేసినట్లు విచారణలో తేలిందన్నారు.
నకిలీ పత్రాల కోసం రూ.3 లక్షల ఒప్పందం
నకిలీ ప్రభుత్వ పత్రాల తయారీ కోసం సుమారు రూ.3 లక్షల పారితోషికానికి ఒప్పందం చేసుకుని, అందులో కొంత మొత్తాన్ని ముందుగానే చెల్లించినట్లు దర్యాప్తులో వెల్లడైందని సీఐ తెలిపారు. డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వ్యక్తుల సహకారంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని నిందితులు ప్రయత్నించినట్లు విచారణలో గుర్తించామని చెప్పారు.
అరెస్టైన నిందితులు
ఈ కేసులో ఏ1 వజ్జా కళ్యాణ్‌రామ్, ఏ2 వజ్జా రవణమ్మ, ఏ3 వజ్జా నాగరాజు, ఏ6 తిర్లంగి లక్ష్మణరావు, ఏ7 వంబరవెల్లి శ్రీనివాసరావు, ఏ8 ముండేటి సురేష్, ఏ9 మోదలవలస వేణుగోపాలరావు, ఏ10 కొసూరు మహేశ్వరరావు, ఏ11 కారాపాటి అనిల్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందన్నారు.
ప్రజలకు పోలీసుల సూచనలు
ప్రభుత్వ భూములు, రిజర్వుడ్ స్థలాలు లేదా ఇతర ఆస్తులను నకిలీ పత్రాల ద్వారా ఆక్రమించేందుకు ప్రయత్నించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ప్రభుత్వ అధికారుల సంతకాలు, అధికారిక ముద్రలను నకిలీగా తయారు చేయడం తీవ్రమైన నేరమని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు.
ఆస్తుల కొనుగోలు, విక్రయాలకు ముందు సంబంధిత రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల ద్వారా పత్రాలను పూర్తిగా ధ్రువీకరించుకోవాలని, అనుమానాస్పద పత్రాలు లేదా అక్రమ రిజిస్ట్రేషన్లపై వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలకు సీఐ పైడిపు నాయుడు విజ్ఞప్తి చేశారు.
