తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు…

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు…
ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : మండలంలోని రేపూడి తండా గ్రామంలో తాగునీటి ఎద్దడి సమస్యను నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకున్నట్లు మండల ఆర్డబ్ల్యూఎస్ ఏ ఈ సి.హెచ్. సాయి లక్ష్మి తెలిపారు. గురువారం గ్రామాన్ని సందర్శించిన ఆమె, మండల సర్వసభ్య సమావేశంలో గ్రామ నాయకులు రేపూడి తండాలో పైపులైన్ ద్వారా మంచినీరు అందడం లేదని ప్రస్తావించడంతో వెంటనే సమస్యపై స్పందించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి కోటిరెడ్డితో కలిసి గ్రామంలో పరిశీలన నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని మూడు బజార్లకు తాగునీరు సక్రమంగా అందే విధంగా పైపులైన్‌కు అవసరమైన వాల్ ను తక్షణమే ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పైపులైన్లో సాంకేతిక సమస్యల కారణంగా నీటి సరఫరా నిలిచిపోయిందని గుర్తించి,దాన్ని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
వేసవి కాలం నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా పంచాయతీ కార్యదర్శులు,సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. గ్రామాల్లోని బోర్లు, పైపులైన్లు,నిల్వ ట్యాంకులు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు నిరంతరంగా మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు బి. గోపిరాజు,గ్రామ నాయకులు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
