Anirudh Reddy | ఈ పువ్వుతో లాభాలు ఎన్నో…

Anirudh Reddy | ఈ పువ్వుతో లాభాలు ఎన్నో…

Anirudh Reddy | ఇప్ప పువ్వు చరిత్ర మరియు ప్రత్యేకత
ఇప్ప పువ్వుతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో
ఇప్పపువ్వులో ఉన్న పోషకాలు
కడుపు, గుండె, చర్మ సమస్యలకు ఇప్పపువ్వు ప్రయోజనం
గిరిజనులకు ఇప్పపువ్వు ఆర్థిక ఆధారం
ఇప్పపువ్వుతో తయారయ్యే లడ్డూలు మరియు ఇతర ఉత్పత్తులు
రక్తహీనత, ఎముకల బలానికి ఇప్పపువ్వు లడ్డు
ఇప్పపువ్వుకు జాతీయ స్థాయిలో గుర్తింపు

Anirudh Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఇప్ప పువ్వుపై అసెంబ్లీలో కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్ప చెట్టుకు 5 వేల ఏళ్ల చరిత్ర ఉందని తెలిపారు. ఇప్పపువ్వుతో తయారు చేసే పానీయాన్ని బ్రిటిష్ కాలంలో దేశీయ సారాను అణచివేయడానికి నిషేధించారని చెప్పారు. కల్తీ సారాకు తాను వ్యతిరేకమేనని, కానీ ఇప్పపువ్వుకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని స్పష్టం చేశారు. దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఈ పువ్వు లభిస్తుందని, అక్కడ గిరిజనులు దీనిని సమర్థంగా వినియోగించుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారని వెల్లడించారు. తెలంగాణలో ఉత్తర ప్రాంతంలో 5 నుంచి 10 లక్షల చెట్లు ఉన్నాయని, వాటితో సారానే కాకుండా లడ్డూ, ఐస్‌క్రీమ్, వైన్ వంటి ఉత్పత్తులు తయారు చేయవచ్చని చెప్పారు.

ఇప్ప పువ్వు అంటే సారా కోసమే కాదు, మనిషిని ఆరోగ్యవంతంగా ఉంచే ఔషధ గుణాలు కలిగిన అద్భుత పువ్వు. ఈ పువ్వుతో కడుపు సమస్యలు, గుండె జబ్బులు, నోటిపూత, కీళ్ల నొప్పులు, చర్మ సమస్యలు వంటి అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలిపారు.

ఇప్పచెట్టు పువ్వు సీజన్ ప్రధానంగా వేసవి కాలంలో ఉంటుంది. ఈ సమయంలో గిరిజనులు అడవికి వెళ్లి చెట్ల కింద రాలిన పూలను సేకరించి, ఎండబెట్టి ఉపాధి పొందుతారు. ఇవి పోషకాలకు నిలయమని ఆదివాసీలు పేర్కొంటున్నారు. ఇప్పపువ్వులను లడ్డూలు, సంప్రదాయ పానీయాలు, ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తారు. ఈ పువ్వుల్లో విటమిన్ B, C, కాల్షియం, ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో ఔషధాల తయారీలో ఇప్ప పువ్వును విరివిగా వాడుతారు. దీనిని నేరుగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇప్పపువ్వు లడ్డు

ఇప్పపువ్వు లడ్డు తినడం వల్ల రక్తహీనత ఉన్న వారికి దాదాపు 45 రోజుల్లో రక్త శాతం పెరగడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని విక్రేతలు చెబుతున్నారు. మోకాళ్ల నొప్పులతో బాధపడేవారికి ఎముకలకు కావాల్సిన పోషకాలు అందించి ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు.

నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఆదివాసీ మహిళలు తయారు చేసే ఇప్పపువ్వు లడ్డూలను ప్రస్తావించారు. ఈ లడ్డూల ద్వారా స్వయం ఉపాధి పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఈ ప్రస్తావనతో ఇప్పపువ్వు లడ్డూలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.