బుడగ జంగాల కాలనీలో ఫుడ్ పాయిజన్..
బుడగ జంగాల కాలనీలో ఫుడ్ పాయిజన్..
80 మందికి తీవ్ర అస్వస్థత
10 మంది పరిస్థితి విషమం..
నీటిని ఫుడ్ ను టెస్టింగ్ నిమిత్తం ల్యాబ్ పంపిస్తున్న అధికారులు..
కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మున్సిపల్ కమిషనర్ హడావుడి పర్యటన…
మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రి తరలింపు..
స్థానికంగా మెడికల్ క్యాంపు నిర్వ హణ..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రమైన నంద్యాల పట్టణంలోని 38 వ వార్డు లో ఉన్న వైయస్సార్ నగర్ లో బుడగ జంగాల కాలనీలో పెళ్లిలో మిగిలిపోయిన భోజనం, చిత్రఅన్నం ఇచ్చారు. సోమవారం రాత్రి 10 గంటలకు మిగిలిపోయిన భోజనం చిత్ర అన్నం తిన్న 80 మందికి తీవ్ర అస్వస్థత జరిగిన సంఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి నుంచి వాంతులు విరేచనాలు మొదలయ్యాయి.పట్టణంలోని వైయస్ నగర్ బుడగ జంగాల కాలనీలో జరిగిన ఈ ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో దాదాపు 80 మంది వరకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు బాధితులు పేర్కొంటున్నారు.

బాధితులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జరిగిన సంఘటనను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తీవ్రంగా పరిగణించారు. వెంటనే జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాగిరి వెంకటరమణ మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న లను సంఘటన స్థలానికి పంపారు.వీరు సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో చేరిన బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎవరో పెళ్లిళ్లు మిగిలిపోయిన భోజనం చిత్రాన్నము ఇవ్వటంతో తిన్న కాలనీవాసులంతా అస్వస్థతకు గురయ్యారు . ఆహారం తిన్న వెంటనే వారికి వాంతులు విరేచనాలు మొదలయ్యాయి. కడుపులో వికారంగా ఉండటంతో కొంతమంది సృహ తప్పి పడిపోయారు.

వెంటనే వీరందరినీ ప్రవేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అధికారులు కొంతమంది బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలపై విచారణ కొనసాగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో పరిశుభ్రత చర్యలు మరింత బలోపేతం చేయాలని సూచించారు. స్లమ్ ఏరియా గా ఉన్న వైఎస్సార్ నగర్లో పారిశుధ్యలోపు స్పష్టంగా కనిపిస్తుంది. విచారణ జరిపిన అధికారులు మాత్రం పరిస్థితి కంట్రోల్ లో ఉందని మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని చెపుతున్నారు. సంబంధిత స్లమ్ ఏరియా వైయస్సార్ నగర్ లో ఉన్న బుడగ జంగాల కాలనీవాసుల నీటిని మరియు చిన్న ఆహారాన్ని టెస్టింగ్ కోసం ల్యాబ్ కు పంపిస్తున్నామని అధికారులు తెలిపారు.

ఫుడ్ పాయిజన్ కావడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. స్థానిక 32 వ వార్డు టిడిపి నాయకుడు తాటికొండ బుగ్గ రాముడు బాధితులకు అండగా నిలబడ్డాడు.కొందరు బయటికి రాకుండా వైద్యం చేయించుకొని ఇంట్లో నే ఉన్నట్టు తెలుస్తోంది.దాదాపు 80 మంది వరకు ఫుడ్ పాయిజన్ అయినట్లు ఆ ప్రాంత వాసులు పేర్కొంటున్నారు. అధికారులు మెడికల్ క్యాంపును నిర్వహించి మెరుగైన చికిత్సను అందిస్తున్నట్లు తెలిపారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
