జొన్నగిరి గోల్డ్ మైన్స్‌ను సందర్శించిన ముకేశ్ కుమార్ మీనా
జొన్నగిరి గోల్డ్ మైన్స్‌ను సందర్శించిన ముకేశ్ కుమార్ మీనా
పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి..
– స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి
తుగ్గలి, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని పగిడిరాయి సమీపంలో ఉన్న జొన్నగిరి గోల్డ్ మైన్స్‌ను రాష్ట్ర మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు గోల్డ్ మైన్స్ యాజమాన్యం, స్థానిక అధికారులు ఘన స్వాగతం పలికారు. సందర్శనలో భాగంగా ముకేశ్ కుమార్ మీనా గోల్డ్ మైనింగ్ కార్యకలాపాలు, ఖనిజ తవ్వకాల విధానం, భద్రతా ప్రమాణాలు, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మైనింగ్ యాజమాన్యం, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గనుల తవ్వకాలతో పాటు పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తవ్వకాల వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి, మొక్కల పెంపకం కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో గోల్డ్ మైన్స్ యాజమాన్యం మరింత చొరవ చూపాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెంచాలని పేర్కొన్నారు. గనుల ప్రాంతాల్లో ప్రజల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గణేష్, పత్తికొండ ఆర్డీవో ఓబులేష్, డీఎస్పీ వెంకట్రామయ్య, తహసీల్దార్ ఎస్. రవి, మండల సర్వేయర్ సుధాకర్, విఆర్వోలు కాశిరంగస్వామి, రంగన్న, రాజేశ్వరి, రూరల్ సీఐ పులి శేఖర్, ఎస్సై మల్లికార్జున, మైనింగ్ జీఎం బాలాజీ, పీఆర్వో రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
