బుగ్గ కోనేరు పైప్‌లైన్ లీకేజీకి మోక్షం..

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కన్నాల శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం సింగరేణి యంత్రాంగం కీలక చర్యలు చేపట్టింది. ఆలయ కోనేరును శుభ్రం చేసే ప్రధాన పైప్‌లైన్ గత కొంతకాలంగా లీకేజీ అవుతుండటంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ విషయాన్ని గమనించిన ఆలయ కమిటీ ప్రతినిధులు మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాధాకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను గుర్తించిన జీఎం రాధాకృష్ణ తక్షణమే స్పందించారు. మందమర్రి సివిల్ విభాగం అధికారి శ్రీధర్, బెల్లంపల్లి సివిల్ విభాగం అధికారి ప్రదీప్‌లను సమన్వయం చేస్తూ తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.

జీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన సివిల్ సిబ్బంది, యుద్ధప్రతిపాదికన పైప్‌లైన్ లీకేజీని అరికట్టి కొత్తగా గేట్ వాల్‌ను ఏర్పాటు చేశారు. సామాన్య భక్తుల కష్టాలను గుర్తించి వెంటనే సమస్యను పరిష్కరించిన జీఎం రాధాకృష్ణకు ఆలయ కమిటీ మరియు భక్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుగ్గ ఆలయ కమిటీ చైర్మన్ దూడం మహేష్ , సంబంధిత సింగరేణి ఫిట్టర్లు ,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.