రూ.వేలు దండుకుంటున్న ఆస్పత్రులు…
రూ.వేలు దండుకుంటున్న ఆస్పత్రులు…
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిత్యం బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద ప్రజలు వైద్యం చేయించుకునేందుకు పలు గ్రామీణ ప్రాంతాల నుంచి, పట్టణం నుంచి వస్తూ ఉంటారు. 30 పడకల ప్రభుత్వాసుపత్రిగా ఉన్న దాన్ని వంద పడకల ఆసుపత్రిగా తీర్చి దిద్దిన ఘనత మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకే దక్కుతుందని గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీను నాయక్ అన్నారు.
మంగళవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులను బట్టి చూస్తే నిన్న జరిగిన సంఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉందని, ప్రజల పైన ఓపి నమోదు చేయించుకునే తరుణంలో ఆన్లైన్ రావటం లేదని, ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వార్డులో వైద్యం పొందుతున్నటువంటి రోగులపై వైద్య సిబ్బంది అసహన వ్యక్తం చేస్తూ సరైన వైద్యం అందించడం లేదని రోగులు వాపోతున్నారు.
పేదలకు వైద్యం అందించాల్సిన డాక్టర్లు ఎపెక్స్ అనే ఆసుపత్రి నెలకొల్పి ఆసుపత్రికి వస్తున్న రోగులు మొత్తాన్ని ఎపెక్స్ ఆసుపత్రిలో సరైన వైద్యం అందుతుందని, వేల రూపాయల ఫీజులు దండుకుంటున్నారు. ప్రజలు కట్టే పన్నుతో ప్రభుత్వాల దగ్గర నుంచి లక్షల రూపాయలు జీతాలు తీసుకొని ప్రైవేట్ ఆస్పత్రి ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ కుమ్మక్కై ఈ విధంగా చేయడం పట్ల ఆయన మండిపడ్డారు. శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఈ విషయంపై జోక్యం చేసుకొని సంబంధిత వైద్యులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ విధంగా చేయకపోతే రాజకీయ, ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేయవలసి వస్తుందని హెచ్చరించారు.
