2రెండో ఎస్‌టీపీ ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేయాలి…2

రెండో ఎస్‌టీపీ ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేయాలి…

వీఎంసీ ఇంజ‌నీరింగ్ అధికారుల‌కు క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ ఆదేశాలు

విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ ప్ర‌త్యేక అధికారి డా. జి. లక్ష్మీశ ఆదివారం విజ‌య‌వాడ రామ‌లింగేశ్వ‌ర న‌గ‌ర్‌లోని 20 ఎంఎల్‌డీ సామ‌ర్థ్య‌మున్న సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంటు (ఎస్‌టీపీ)ని సంద‌ర్శించారు. మురుగునీటి శుద్ధి ప్రక్రియ, వినియోగంలో ఉన్న సాంకేతిక విధానాలు, నిర్వహణ తీరు వంటి అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్లాంట్ సామర్థ్యానికి అనుగుణంగా శుద్ధి జరుగుతోందా లేదా అన్న దానిపై సమగ్రంగా సమీక్షించారు. అదేవిధంగా కొత్త‌గా ఏర్పాటుచేస్తున్న మ‌రో 20 ఎంఎల్‌డీ సామ‌ర్థ్య‌మున్న ప్లాంటు ప‌నుల పురోగ‌తిని అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ లక్ష్మీశ మాట్లాడుతూ పెరుగుతున్న న‌గ‌ర విస్తీర్ణం, జ‌నాభాను దృష్టిలో ఉంచుకుని మురుగునీటి శుద్ధి అత్యంత కీల‌క‌మ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ఉన్న ఎస్‌టీపీ సామ‌ర్థ్యానికి తోడు నిర్మాణంలో ఉన్న రెండో ఎస్‌టీపీ ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేసి వినియోగంలోకి తేవాల‌ని ఇంజ‌నీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు.

ప‌నుల నాణ్యతపై ఎలాంటి రాజీ లేకుండా, నిర్ణీత గ‌డువుల్లో పూర్తి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తీ దశలో సాంకేతిక ప్రమాణాలు పాటిస్తూ, పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా పనులు కొనసాగించాలన్నారు. ఈ ప‌నుల పురోగ‌తిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ వేగవంతం చేయాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ స్ప‌ష్టం చేశారు. క‌లెక్ట‌ర్ వెంట న‌గ‌ర‌పాల‌క సంస్థ ఇన్‌ఛార్జ్ సీఈ పి.స‌త్య‌కుమారి ఉన్నారు.