కిరీటం అలంకరించే వరకు ఆలయంలోనే ఉంటా..

కిరీటం అలంకరించే వరకు ఆలయంలోనే ఉంటా..
- బంగారు కిరీటం వ్యవహారంపై ఆలయంలో యలవర్తి ఆందోళన
గుడివాడ, ఆంధ్రప్రభ ; గుడివాడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కోటి రూపాయల బంగారు కిరీటం మాయమైన వ్యవహారంపై విచారణ జరుగుతుండగా ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఆలయానికి చేరుకున్నారు. దేవస్థాన ట్రస్ట్ బోర్డు చేసిన ఘోర తప్పిదంపై యలవర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీరు చేసిన తప్పు వల్ల గుడివాడకు చెడ్డపేరు వస్తుందని కమిటీ సభ్యులకు ఫోన్ చేసి చెప్పానని ఆయన తెలిపారు. భక్తుల తరపున గురువారం ఉదయం 11 గంటలకల్లా కిరీటాన్ని స్వామివారికి అలంకరించాలని డెడ్‌లైన్ పెట్టామని స్పష్టం చేశారు.
కమిటీ సభ్యులు స్పందించకపోవడంతో కిరీటం అలంకరించే వరకు ఆలయంలోనే భీష్మించి కూర్చుంటానని యలవర్తి తేల్చిచెప్పారు. కిరీటం తాకట్టు పెట్టుకున్న బంగారు వ్యాపారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దేవుడి విషయంలో జరిగిన అపచారం భక్తులను కలచివేసిందని, ఈ విషయంపై ఉన్నత స్థాయికి వెళ్తానని యలవర్తి హెచ్చరించారు. సాయంత్రం లోపు కిరీటం అలంకరించకుంటే భక్తులతో కలిసి యాక్షన్ ప్లాన్‌లో దిగుతామని, భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే సహించేది లేదని స్పష్టం చేశారు.
