విద్యుత్ సేవల్లో విప్లవాత్మక మార్పు
విద్యుత్ సేవల్లో విప్లవాత్మక మార్పు
- ఎల్సీ యాప్‌తో భద్రతకు భరోసా
- అత్యాధునిక సాంకేతికతతో ప్రమాదాలకు చెక్
- భూపాలపల్లి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ బి. మల్చూరు
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు క్షేత్రస్థాయి ఉద్యోగుల భద్రతను పటిష్టపరిచే దిశగా విద్యుత్ శాఖ కీలక ముందడుగు వేసింది. ఎల్సీ (లైన్ క్లియర్) యాప్‌ను ప్రవేశపెట్టి విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు భూపాలపల్లి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ బి. మల్చూరు తెలిపారు.
ఈ యాప్ విద్యుత్ సిబ్బంది భద్రతకు అత్యంత కీలకంగా మారిందని ఆయన పేర్కొన్నారు. తప్పుడు ఫీడర్ ఎంపిక, పంపిణీ వ్యవస్థపై అవగాహన లోపం, సమాచార లోపం, మాన్యువల్ విధానాల్లో జాప్యం వంటి కారణాలతో గతంలో చోటుచేసుకున్న ప్రమాదాలను ఈ యాప్ ద్వారా నివారించవచ్చని వివరించారు.
డిజిటల్ విధానంలో అనుమతులు జారీ
ఎల్సీ యాప్ ద్వారా లైన్ క్లియర్ అనుమతులు పూర్తిగా డిజిటల్ విధానంలో జారీ అవుతాయని, పని చేయాల్సిన ఫీడర్ మరియు పంపిణీ లైన్ వివరాలు స్పష్టంగా ప్రదర్శితమవుతాయని ఎస్ఈ తెలిపారు. తప్పుడు ఫీడర్ ఎంపికకు అవకాశం లేకుండా వ్యవస్థ అప్రమత్తం చేస్తుందని, అధికారులు, సిబ్బంది మధ్య రియల్‌టైమ్ సమాచార మార్పిడి సులభమవుతుందని చెప్పారు. అలాగే.. ప్రతి ఎల్సీ జారీ, వినియోగం, రద్దు వివరాలు డిజిటల్‌గా నమోదవడం వల్ల పారదర్శకత పెరుగుతోందన్నారు.
ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రతి సిబ్బంది ఈ యాప్‌ను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. ఈ యాప్ వినియోగంతో విద్యుత్ ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని, సంస్థలో జవాబుదారీతనం పెరిగిందని తెలిపారు. సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తీసుకున్న చర్యల ఫలితంగా పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా మారిందని, అంతరాయాలు తగ్గి సిబ్బంది సౌకర్యవంతంగా పనులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
