పార్టీ బలోపేతమే లక్ష్యం…
పార్టీ బలోపేతమే లక్ష్యం…
వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి..
రాష్ట్ర పునర్నిర్మాణానికి సీఎం చంద్రబాబు నిరంతర కృషి
లోకేష్ దిశానిర్దేశంతో క్షేత్రస్థాయిలో టీడీపీ బలోపేతం
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 1.32 లక్షల మందికి రూ.1179 కోట్లు
క్లస్టర్ క్యాడర్ శిక్షణలో నేతలకు మాజీ మంత్రి దేవినేని ఉమా మార్గదర్శనం
ఆంధ్రప్రభ, విజయవాడ రూరల్ : రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనునిత్యం కృషి చేస్తున్నారని, అదే సమయంలో వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను పార్టీ శ్రేణులు గట్టిగా ఎదుర్కోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ క్లస్టర్ల కోసం నిర్వహించిన టిడిపి సంస్థాగత రూపకల్పన – విధులు, బాధ్యతలు అంశంపై నిర్వహించిన శిక్షణ తరగతుల్లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొని నేతలకు మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన విజన్‌తో ముందుకు సాగుతున్నారని తెలిపారు.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిశానిర్దేశంతో టిడిపిని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రతి క్లస్టర్ ఇన్‌ఛార్జి, ప్రతి నాయకుడు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ పార్టీని ప్రజలకు మరింత దగ్గర చేయాలని సూచించారు. అభివృద్ధితో పాటు తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేసే శక్తులను గట్టిగా ఎదుర్కోవాలని ఆయన అన్నారు. ప్రజలకు నిజాలు తెలియజేయడం పార్టీ కార్యకర్తల బాధ్యత అని చెప్పారు. వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను ప్రతి కార్యకర్త వాస్తవాలతో తిప్పికొట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారని దేవినేని ఉమా తెలిపారు.

ఇప్పటివరకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 1.32 లక్షల మందికి రూ.1179 కోట్లు అందజేసి పేదల ప్రాణాలను కాపాడారని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ ప్రజాసేవకు నిదర్శనమని అన్నారు. పార్టీ సంస్థాగత బలాన్ని పెంచడం ద్వారానే టిడిపి మరింత శక్తివంతమవుతుందని, ప్రతి క్లస్టర్ నాయకుడు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి పార్టీపై విశ్వాసాన్ని మరింత బలపరచాలని దేవినేని ఉమా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు, క్లస్టర్ ఇన్‌ఛార్జులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
