నిప్పన్ స్టీల్ ప్రాజెక్టుకు భూమి పూజ

నిప్పన్ స్టీల్ ప్రాజెక్టుకు భూమి పూజ

  • రాజయ్యపేటలో రూ.1.5 లక్షల కోట్లతో నిర్మాణం
  • 30వేల మంది యువతకు ఉపాధి
  • తొలి దశలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను మించిన ఉత్పత్తి సామర్థ్యం
  • కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రూపురేఖలను మార్చే విధంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్’ (ఐఎస్పీ) ఏర్పాటుకు సర్వం సిద్ధమైందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు. భీమవరంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 23న సాయంత్రం 4 గంటలకు ఆర్సెలార్ మిట్టల్ , నిప్పన్ స్టీల్ సంస్థల ఆధ్వర్యంలో ఈ భారీ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ​

మొత్తం రూ.1.5 లక్షల కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం కానున్న ఈ భారీ ప్రాజెక్టు రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలోనే అతిపెద్దదిగా నిలవనుంది అని పేర్కొన్నారు. తొలి దశలో రూ.80,000 కోట్ల భారీ పెట్టుబడితో పనులు ప్రారంభమవుతాయని, 2029 నాటికి మొదటి దశ పూర్తి చేసి, ఏటా 8.2 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వివరించారు. ఈ ఉత్పత్తి సామర్థ్యం విశాఖ ఉక్కు ప్లాంట్ కంటే కూడా అధికమని, తదుపరి దశలో దీనిని 18.7 మెట్రిక్ టటన్నులకు విస్తరించి దేశంలోనే అతిపెద్ద ప్లాంట్‌గా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ​

ఈ మెగా ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అన్నారు. మొదటి దశలోనే సుమారు 30 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. కేవలం ఏడాది కాలంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అన్ని రకాల అనుమతులను మంజూరు చేయడం ఒక రికార్డు అని, ఇది ప్రధాని మోడీ, కేంద్రమంత్రి కుమారస్వామి సంపూర్ణ సహకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కృషితో సాధ్యమైందని ఆయన కొనియాడారు. ​

పర్యావరణ హితానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన మొత్తం 2200 ఎకరాల విస్తీర్ణంలో 33 శాతం అంటే సుమారు 700 ఎకరాలకు పైగా గ్రీన్ బెల్ట్ (పచ్చదనం) కోసం కేటాయించామని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఛత్తీస్‌గఢ్‌లోని కిరండల్ నుండి రాజయ్యపేట వరకు 245 కి.మీ.ల పొడవైన స్లర్రీ పైప్‌లైన్ ద్వారా ముడి సరుకు రవాణాకు ఎన్ఎండీసీ అనుమతులు మంజూరు చేసిందని వివరించారు. ప్లాంట్‌కు అవసరమైన 860 మెగావాట్ల విద్యుత్‌లో 220 మెగావాట్లను అంతర్గతంగానే ఉత్పత్తి చేసుకుంటూ మిగిలినది గ్రిడ్ నుండి తీసుకోవడం జరుగుతుందన్నారు.

ఈ ప్రాజెక్టు కోసం రోజుకి 135 ఎంఎల్డీ నీటి అవసరం ఉండగా పోలవరం కాలువ నీటిని, రీసైకిల్డ్ నీటిని సమర్థవంతంగా వినియోగిస్తామని చెప్పారు. ప్రధాని మోదీ సంకల్పం మేరకు 2030 నాటికి దేశీయంగా 300 మిలియన్ టన్నుల ఉక్కు సామర్థ్యాన్ని సాధించడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. తాను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గా ఉన్న సమయంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు రూ.11,500 కోట్ల ప్యాకేజీ సాధించడంతో పాటు, నక్కపల్లిలో ఇంతటి మెగా ప్లాంట్‌ను తీసుకురావడం తనకెంతో సంతోషాన్ని ఇస్తోందని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply