తలసరి ఆదాయం పెంపు దిశగా ప్రణాళికలు…

తలసరి ఆదాయం పెంపు దిశగా ప్రణాళికలు…
జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి
కర్నూలు, ఆంధ్రప్రభ : జిల్లాలో తలసరి ఆదాయం పెంపు దిశగా అన్ని శాఖలు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో తలసరి ఆదాయం, జిల్లా స్థూల ఉత్పత్తి (GDDDP), పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రస్తుతం జిల్లా తలసరి ఆదాయం తక్కువగా ఉన్నందున దాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జిల్లా స్థూల ఉత్పత్తి (GDDDP) పెరిగితేనే తలసరి ఆదాయం పెరుగుతుందని స్పష్టం చేశారు.
అందుకు అనుగుణంగా అన్ని శాఖలు తమ తమ పరిధిలో స్థూల ఉత్పత్తి వృద్ధికి దోహదపడే ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ లక్ష్య సాధనకు ప్రభుత్వం 120 రోజుల గడువు నిర్దేశించినట్లు తెలిపారు. పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అంశంలో మహిళా శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖల సేవలకు సంబంధించి ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో సానుకూల స్పందన రాలేదని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎంహెచ్‌ఓ, పీడీ ఐసీడీఎస్‌లకు సూచించారు.
సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లను ప్రతి వారం ఎంపీడీఓలు, తహశీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా సందర్శించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
బుధవారం నుండి ప్రతి శాఖతో విడివిడిగా సమీక్షలు నిర్వహిస్తామని, అధికారులు తమ మూడు నెలల కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్ ప్లాన్)తో పాటు ప్రగతి నివేదికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, డీఆర్‌ఓ సి. వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
