మహిళల భద్రతకు ఆపరేషన్ దండాయన

మహిళల భద్రతకు ఆపరేషన్ దండాయన

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: మహిళలు, బాలికలపై జరిగే నేరాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అమలు చేస్తున్న ఆపరేషన్ దండాయన కార్యక్రమాన్ని కర్నూలు జిల్లాలో మరింత విస్తృతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.

గోనెగండ్ల పోలీస్ స్టేషన్ సమీపంలోని భాషా ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం మహిళల భద్రత, నేరాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆపరేషన్ దండాయన పోస్టర్లను ఆవిష్కరించారు.

మహిళలు, బాలికల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని ఎస్పీ తెలిపారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై జీరో టాలరెన్స్ విధానంతో వ్యవహరిస్తున్నామని చెప్పారు. నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

జీరో టాలరెన్స్‌తో చర్యలు

మహిళలపై జరిగే నేరాలు, పోక్సో, గృహహింస, వేధింపుల కేసుల్లో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రతి కేసులో 60 రోజుల్లోపు చార్జిషీట్ దాఖలు చేయడం, కీలక కేసులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టులకు పంపడం ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం అందించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.

మహిళలపై నేరాలకు పాల్పడే వారు ఎవరైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

10 కేసుల్లో 17 మందికి శిక్షలు

2025 జనవరి నుంచి 2026 మే 28 వరకు కర్నూలు జిల్లాలో మహిళలు, బాలికలపై జరిగిన నేరాలకు సంబంధించిన 10 కేసుల్లో మొత్తం 17 మంది నిందితులకు శిక్షలు పడినట్లు ఎస్పీ వెల్లడించారు. వీటిలో పోక్సో, మహిళలపై వేధింపులు, ఎస్సీ, ఎస్టీ చట్టాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని తెలిపారు.

కొన్ని పోక్సో కేసుల్లో నిందితులకు 20 సంవత్సరాల జైలు శిక్షలు విధించబడినట్లు వివరించారు. బాధితులకు న్యాయం అందించేందుకు కాన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్‌ను పటిష్ఠంగా అమలు చేస్తున్నామని చెప్పారు.

59 మంది నిందితులపై రౌడీషీట్లు

మహిళలపై నేరాలకు పాల్పడే పునరావృత నేరస్తులపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని ఎస్పీ తెలిపారు. 2025-26 కాలంలో మహిళలపై నేరాలు, పోక్సో కేసుల్లో ప్రమేయం ఉన్న 59 మంది నిందితులపై రౌడీషీట్లు తెరిచినట్లు చెప్పారు.

అలాగే సెక్సువల్ అఫెండర్ షీట్లు నిర్వహిస్తూ వారి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. నేరస్తులపై నిఘా మరింత కఠినంగా ఉంటుందని స్పష్టం చేశారు.

మహిళల భద్రతకు ఆపరేషన్ దండాయన

Leave a Reply