Varahaswamy | ముచ్కూర్లో భక్తుల సంబరాలు…

Varahaswamy | ముచ్కూర్లో భక్తుల సంబరాలు…
- ఆలయ నిర్మాణానికి కదిలిన గ్రామం
Varahaswamy | భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్గల్ మండలంలోని ముచ్కూర్ గ్రామంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన పెద్దగుట్టపై పురాతన లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఆనవాళ్లు వెలుగులోకి రావడం గ్రామంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది.గుట్టపై దారి లేకపోవడంతో ఇప్పటివరకు పక్కనున్న పాఠశాలలో స్వామివారికి నైవేద్యం సమర్పిస్తూ మొక్కులు తీర్చుకునే భక్తులు, ఇటీవల సమూహంగా చందాలు సమీకరించి తవ్వకాలు చేపట్టారు.
జేసీబీ సహాయంతో తాత్కాలిక రహదారి ఏర్పాటు చేసి పూజలు ప్రారంభించారు. శనివారం గుహలోకి ప్రవేశించే క్రమంలో లక్ష్మీనరసింహ స్వామి తొలి అవతారం వరాహస్వామి భూదేవి విగ్రహం ప్రత్యక్షం కావడంతో భక్తులు ఆనందభాష్పాలతో నిండిపోయారు. గ్రామదేవుడు వెలుగులోకి రావడం గ్రామాభివృద్ధికి శుభ సూచకమని భావించిన గ్రామస్తులు, దాతల సహకారంతో పెద్దగుట్టపై శాశ్వత ఆలయ నిర్మాణం చేపట్టి భక్తులకు దర్శనసౌకర్యం కల్పించ నున్నట్లు తెలిపారు.
