TTD TEMPLE | జూబిలీహిల్స్‌లో మహా వైభవంగా బ్రహ్మోత్సవాలు

TTD TEMPLE | జూబిలీహిల్స్‌లో మహా వైభవంగా బ్రహ్మోత్సవాలు

TTD TEMPLE | చక్రస్నానంతో తుది మంగళ ఘట్టం
భక్తులతో కిటకిటలాడిన మాడవీధులు
‘శ్రీమాలిక’ గ్రంథం ప్రత్యేక ఆకర్షణ
పురాణపండ శ్రీనివాస్ పాల్గొనడం విశేషం
ధ్వజావరోహణంతో ఉత్సవాల ముగింపు

హైదరాబాద్, ఆంధ్రప్రభ: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్టుగా వేలాది మంది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి విశాల ఆలయ ప్రాంగణంలో గత తొమ్మిది రోజులుగా మహా వైభవంగా నిర్వహిస్తున్న ఆరవ బ్రహ్మోత్సవాల తుదిమంగళ ఘట్టం బుధవారం ఉదయం శ్రీవారికి చక్రస్నానంతో వేదఘోషల మధ్య అద్భుతంగా జరిగింది. గత తొమ్మిది రోజులుగా మలయప్ప స్వామి వివిధ వాహనాలపై నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా విహరించగా, వెనుకనే భక్తుల జనసంద్రం పోటెత్తింది. భాగ్యనగర చరిత్రలో ఇది ఒక అపూర్వ భక్తి ఘట్టంగా నిలిచింది.

TTD TEMPLE

జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి అనుగ్రహంతో, తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముద్దాడ రవిచంద్ర ఆదేశాల మేరకు, టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల నాయుడు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు నిర్వహించబడ్డాయి. హైదరాబాద్ టీటీడీ ఏఈవో రమేష్, జూబిలీహిల్స్ టెంపుల్ ఇన్‌చార్జి నిరంజన్ సమన్వయంతో ఉత్సవాలు జంటనగరాల చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి, కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్, బీఎస్ఎస్పీఎల్ ఇన్ఫ్రా గ్రూప్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య సమర్పించిన ‘శ్రీమాలిక’ అనే నాలుగు వందల పేజీల గ్రంథం విశేష ఆకర్షణగా నిలిచింది.

TTD TEMPLE

ఉత్సవాల ప్రారంభానికి ముందే వేల ప్రతులను టెంపుల్ ఇన్‌చార్జికి అర్చకుల సమక్షంలో అందజేశారు. అనంతరం ఏఈవో రమేష్ పర్యవేక్షణలో ఈ గ్రంథాన్ని ఉత్సవాలకు సహకరించిన దాతలు, పారిశ్రామికవేత్తలు, వీఐపీ దర్శనాల్లో పాల్గొన్న మంత్రులు, ప్రముఖులకు ప్రసాదంతో పాటు ఆశీర్వచన మండపంలో అందజేశారు. ముఖ్యంగా ప్రముఖ రచయిత, శ్రీశైలం దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం విశేషంగా నిలిచింది. ఆయన సమర్పించిన ‘శ్రీమాలిక’ గ్రంథం బ్రహ్మోత్సవాల శోభను మరింత పెంచింది.

TTD TEMPLE

ఉదయం, సాయంత్ర వేళల్లో ఆయన పాల్గొనడం భక్తులను ఆకర్షించింది. ఎంతోమంది భక్తులు ఆయనతో సెల్ఫీలు దిగారు. ఈ మహద్భాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలమని పేర్కొంటూ టీటీడీ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ చైర్మన్ ఏ.వి.రెడ్డి ప్రతిరోజూ మాడవీధుల్లో జరిగిన ఉభయ సంధ్యల వాహనసేవలను పర్యవేక్షించారు. తిరుమల నుంచి వచ్చిన వేదపండితులు వైఖానస ఆగమోక్త విధానంలో వైదిక కర్మలను నిర్వహించారు.

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ చక్రస్నాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చక్రస్నాన మహోత్సవం తిరుమల ఉత్సవాన్ని తలపించిందని వేలాది మంది భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. సాయంకాలం బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా వేదఘోషల మధ్య ధ్వజావరోహణ కార్యక్రమం నిర్వహించారు. భక్తుల గోవిందనామస్మరణ మధ్య హైదరాబాద్ టీటీడీ ఏఈవో రమేష్, ఇన్‌చార్జి నిరంజన్, టీటీడీ జూబిలీహిల్స్ చైర్మన్ ఏ.వి.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply