ట్యూబ్‌లైట్ పగలగొట్టి యువకుడిపై దాడి

మచిలీపట్నం , ఆంధ్రప్రభ : మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధి ఈడేపల్లి ప్రాంతంలో ఇద్దరు యువకులు మత్తులో ట్యూబ్ లైట్ పగలగొట్టి సాయి గణేష్ అనే వ్యక్తిని పొడిచారు. గంజాయి మత్తులో దాడికి పాల్పడ్డారంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. సేకరించిన వివరాలు ప్రకారం.. ఈడేపల్లి ప్రాంతంకు చెందిన సాయి గణేష్, సోమశేఖర్, కన్నా అనే వ్యక్తులు గతంలో స్నేహితులుగా ఉండేవారు. సాయి గణేష్ అనే వ్యక్తి చదువుకుంటూ ఉండటంతో దురాలవాట్లు ఉన్న సోమశేఖర్, కన్నాలకు దూరంగా ఉంటున్నాడు. దీనితో పగ పెంచుకున్న యువకులు ద్విచక్ర వాహనానికి పెట్రోల్ కొట్టించడానికి వెళ్తున్న సాయి గణేష్ ను అడ్డగించారు.
వారితో (యువకులు) తిరగడం లేదని సాయి గణేష్ తో ఘర్షణ పడ్డారు. దీనితో మాట మాట పెరిగి దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో యువకులు పక్కనే ఉన్న ట్యూబ్ లైట్ను పగలగొట్టి పొడిచారు. దీనితో గాయాలైన సాయి గణేష్ ని శనివారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించి గాయానికి ఆరు కుట్లు వేశారు. సాయి గణేష్ కుటుంబ సభ్యులు గంజాయి మత్తులోనే తమ కుమారుడిని ట్యూబ్ లైట్ తో పొడిచారని ఆరోపించారు. పోలీసులు సాయి గణేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
