Cybercrime | మహిళలపై నేరాలు….

Cybercrime | మహిళలపై నేరాలు….

  • ఈవ్ టీజింగ్, సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం…
  • పత్తికొండ డీఎస్పీ వెంకట రామయ్య సూచనలు…

Cybercrime | ఆస్పరి, ఆంధ్రప్రభ : మహిళలపై జరుగుతున్న నేరాలు, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పత్తికొండ డిఎస్పీ వెంకట రామయ్య పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పత్తికొండ సబ్ డివిజన్ పరిధిలోని ఆస్పరి మండలం జెడ్పీహెచ్ పాఠశాలలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ వెంకట రామయ్య మాట్లాడుతూ, మహిళలపై వేధింపులు, ఈవ్ టీజింగ్ వంటి చర్యలు చట్టపరంగా శిక్షార్హమైన నేరాలేనని తెలిపారు.

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకుని బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. సమాజంలో జరుగుతున్న నేరాలను నిరోధించడంలో పోలీసులకు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్ నేరాల నేపథ్యంలో సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, ఆన్‌లైన్ ఆఫర్లు, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Cybercrime |

అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్‌లు వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన డయల్ 112, డయల్ 100, 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ల గురించి విద్యార్థులకు వివరించారు. పోలీసు సేవలు ప్రజల భద్రత కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఐవీఆర్‌ఎస్ కాల్స్‌కు ఎలా స్పందించాలి, ఎలాంటి సమాచారాన్ని పంచుకోవాలి, ఎలాంటి వివరాలు ఇవ్వకూడదనే అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.

Cybercrime |

సోషల్ మీడియా వేదికల్లో వ్యక్తిగత వివరాలు పంచుకోవడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. స్నేహితుల పేరుతో వచ్చే నకిలీ ఖాతాల మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆస్పరి సిఐ గంగాధర్, పోలీసు స్టేషన్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, ఆస్పరి గ్రామ జి ఎం ఎస్ కే సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడంతో పాటు భద్రతా జాగ్రత్తలపై స్పష్టత కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply