VIJAYAWADA | ఇన్ఫ్రారెడ్ మిషన్ షురూ

VIJAYAWADA| ఇన్ఫ్రారెడ్ మిషన్ షురూ
రోడ్ల మరమ్మతుల్లో అత్యాధునిక సాంకేతికతకు శ్రీకారం…
గురునానక్ కాలనీలో రీసైక్లింగ్ టెక్నాలజీతో రోడ్డు గుంతల పూడ్చివేత..
ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేతుల మీదుగా ప్రారంభం..
విజయవాడను మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామన్న హామీ
VIJAYAWADA | ( ఆంధ్రప్రభ విజయవాడ) విజయవాడ నగరంలో రోడ్ల మరమ్మతులకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించే దిశగా కీలక అడుగు పడింది. గురునానక్ కాలనీలో ఇన్ఫ్రారెడ్ సాంకేతికతతో రీసైక్లింగ్ విధానంలో రోడ్డు గుంతలను పూడ్చే మొబైల్ ఇన్ఫ్రారెడ్ మిషన్‌ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్‌క్యాప్ (నేషనల్ క్లిన్ ఎయిర్ ప్రోగ్రామ్) ద్వారా విజయవాడకు అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ ఇన్ఫ్రారెడ్ మిషన్ ద్వారా పాత రోడ్లను తవ్వకుండా, ఉన్న బిటుమెన్‌ను రీసైక్లింగ్ చేసి, తక్కువ సమయంలోనే గుంతలు పూడ్చే అవకాశం ఉంటుందని వివరించారు. దీనివల్ల ట్రాఫిక్ అంతరాయం లేకుండా, ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. త్వరలో విజయవాడ నగరానికి ఎన్‌క్యాప్ ద్వారా రూ.32 కోట్ల పూర్తి గ్రాంట్ మంజూరవుతుందని కేంద్రం హామీ ఇచ్చిందని ఎంపీ వెల్లడించారు. ఈ నిధులతో రోడ్లు, డ్రైనేజీలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.
.. కార్పొరేషన్ నుంచి కనీసం లభించని సహాయం…
గత ఐదేళ్లుగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) కౌన్సిల్లో టీడీపీ నాయకులు, కార్పొరేటర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎంపీ కేసినేని శివనాథ్ విమర్శించారు. నగర అభివృద్ధికి ప్రతిపాదించిన చాలా ప్రాజెక్టులు కౌన్సిల్లో తిరస్కరణకు గురయ్యాయని ఆరోపించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్‌కు రూ.600 కోట్లు వచ్చినా వైసీపీ కౌన్సిల్ తిరస్కరించిందని, ఇది నగరాభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారిందన్నారు. వైసీపీ కౌన్సిల్ విజయవాడ అభివృద్ధిని కోరుకోవడం లేదని, అందుకే కీలకమైన ప్రాజెక్టులన్నింటినీ అడ్డుకుంటోందని ఎంపీ విమర్శించారు. మరో ఐదారు రోజుల్లో ప్రస్తుత కౌన్సిల్ రద్దు కావడం విజయవాడ నగరానికి ఉపశమనంగా మారుతుందని వ్యాఖ్యానించారు. రాబోయే కొత్త కౌన్సిల్‌తో కలిసి రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రామ్ వాటర్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. విజయవాడను అమరావతి ప్రాంతంలో మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
