14thFebCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

14thFebCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

14thFebCartoon |మూడో తరగతి నుంచే ఏఐ అవగాహన –
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు
ఏఐ విస్తరణతో టెక్ ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆందోళన
కొత్త ఉద్యోగాలా? లేక ఉన్నవే కోల్పోవడమా?
విద్యార్థుల అభ్యాసంపై ఏఐ ప్రభావం ఏంటి?
కాలిక్యులేటర్ నుంచి ఏఐ వరకు – మారుతున్న విద్యా విధానం
ఏఐ దుర్వినియోగంపై చమత్కార చిత్రణ
‘ఔరా’ కార్టూన్‌లో సమకాలీన అంశంపై వినూత్న స్పందన
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : విద్యార్థులకు మూడో తరగతి నుండే ఏఐ పట్ల అవగాహన, బోధన ఉండాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పిన మాటలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.
అయితే ఇప్పటికే టెక్ ఉద్యోగులంతా ఏఐ ప్రభావంపై తీవ్ర ఆందోళన, అనిశ్చితి, భవిష్యత్ భయంతో తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇది విస్తరించి తమ ఉద్యోగాలకు ఎసరు, ప్రమాద ఘంటికలు మోగిస్తోందని భావిస్తున్నారు.
అంతేకాదు, భవిష్యత్తులో తమ అవసరమే లేకుండా అన్నీ తానే చేసి పెట్టేస్తోందనే భావన వారికి గుండె దడ, మానసిక ఒత్తిడి కలిగిస్తోంది. ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోతున్నవారెందరో ఉన్నారన్నది ఒక కఠిన వాస్తవం. కృతిమ మేధ కాస్తా అసలు మేధకే సవాల్ విసురుతోందని నిపుణులు చెబుతున్నారు.
కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ఆశావహులు చెప్పినా, ప్రస్తుతం కనిపిస్తున్నది మాత్రం ఉద్యోగాల క్షీణత అనే నిర్దాక్షిణ్య సత్యం.
ఈ దశలో మూడో తరగతి నుంచే విద్యార్థులకు ఏఐ బోధన అన్న ప్రతిపాదన అందరిలో ఆశ్చర్యం, ఆలోచన, కొందరిలో ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఏఐ గురించి లోతుగా నేర్చుకోవడం అనేది దాన్ని సృష్టించే వారికి మాత్రమే అవసరమా? లేక అందరికీనా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
కావాల్సిన కమాండ్ ఇస్తే క్షణాల్లో సమాధానం వచ్చేస్తున్న ఈ సూపర్ ఫాస్ట్ టెక్నాలజీ నేపథ్యంలో విద్యార్థులు కష్టపడి చదువుతారా? అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది. ఒకప్పుడు కాలిక్యులేటర్ ఉపయోగిస్తేనే అభ్యంతరం తెలిపిన గురువులు, ఇప్పుడు అంతకంటే ఎన్నో రెట్లు అద్భుతమైన, శక్తివంతమైన ఏఐని ఎలా స్వీకరిస్తారు?
ఇలాంటి విభిన్న ఆలోచనల మధ్య, ఆంధ్రప్రభ కార్టూనిస్ట్ మాధవ్ అందించిన కార్టూన్ ఈ సమకాలీన అంశాన్ని తీవ్రతతో, చమత్కారంతో, సూటిగా ప్రతిబింబించింది. ఏఐ దుర్వినియోగం ఎలా ఉండొచ్చో ఒక సృజనాత్మక ఊహకు రూపం ఇచ్చిన ఈ కార్టూన్ నిజంగా ఆలోచింపజేసే, ప్రభావవంతమైన కళాఖండం.
గత రెండు దశాబ్ధాలుగా ఆంధ్రప్రభ పాఠకులను అలరిస్తోన్న ‘ఔరా’ కార్టూన్ ఫీచర్ మరోసారి తన తీవ్ర సామాజిక స్పందన, మేధో చురుకుదనంను చాటుకుంది.
