108vehicle | ఉపాధ్యాయురాలిపై ఆటో డ్రైవర్ కత్తి తో దాడి

108vehicle | ఉపాధ్యాయురాలిపై ఆటో డ్రైవర్ కత్తి తో దాడి
108vehicle | డ్రైవర్ చేతిలోని కత్తి లాక్కొని ఎదురుదాడికి దిగిన డైనమిక్, ధైర్యవంతురాలు ఉపాధ్యాయురాలు హరిత
మెడలో బంగారం కోసమేనా ఈ కిరాతక దాడి..?
మరేదైనా రహస్య కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసుల సమగ్ర విచారణ
గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసుల చాకచక్యం
108vehicle | గూడూరు, ఆంధ్రప్రభ : గూడూరు, ఆంధ్రప్రభ: ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై ఆటో డ్రైవర్ విచక్షణారహితంగా, కిరాతకంగా కత్తితో దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొని పరారైన ఘటన గూడూరు రూరల్ పరిధిలో భయాందోళనలు, ఆగ్రహం రేపింది. చెమిర్తి సమీపంలోని తిరుపతిగారి పల్లి వద్ద గురువారం ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది.
రూరల్ పోలీసుల సమాచారం ప్రకారం, ఉపాధ్యాయురాలు హరిత విధులకు వెళ్తుండగా కోడివాక వెంకటరమణ అనే ఆటో డ్రైవర్ వాహనంలో ప్రయాణించింది. మార్గమధ్యంలో ఇద్దరు ప్రయాణికులు దిగిపోయిన తర్వాత, చెమిర్తి గ్రామం దాటి సమీపంలో ఆటోకు మరమ్మత్తులు ఉన్నట్లు నాటకమాడి, ఒక్కసారిగా తన వద్ద ఉన్న కత్తితో హరితపై అత్యంత దారుణంగా దాడి చేశాడు. రెండు సార్లు కత్తితో పొడిచి, గొంతుపై గాయపరచి, మెడలోని బంగారు గొలుసు లాగే ప్రయత్నం చేశాడు.

అయితే భయానికి లొంగకుండా, అసాధారణ ధైర్యసాహసాలతో హరిత నిందితుడి చేతిలోని కత్తిని లాక్కొని ఎదురుదాడికి దిగింది. ఆమె చూపిన సాహసవీరత్వం, ఆత్మస్థైర్యం అక్కడి పరిస్థితిని కాసేపు మార్చాయి. కానీ నిందితుడు ఆమెను ఆటో నుండి రోడ్డుపై తోసేసి గొలుసు లాక్కొని పరారయ్యాడు.
రక్తపు మడుగులో పడిన హరితను గమనించిన గ్రామస్తులు వెంటనే స్పందించి 108 వాహనానికి, పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల మానవత్వం, తక్షణ స్పందనతో ఆమెను గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించినట్లు సమాచారం.
ఇక పరారవుతున్న నిందితుడిని రూరల్ పోలీసులు వేగవంతమైన చర్య, అత్యుత్తమ చాకచక్యంతో గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటన ప్రాంతంలో ఉలిక్కిపాటు, భయ వాతావరణం సృష్టించినప్పటికీ, ఉపాధ్యాయురాలి అసమాన ధైర్యం అందరినీ ఆశ్చర్యానికి, ప్రశంసలకు గురిచేసింది.
