కోటబొమ్మాళి హత్య కేసులో ట్విస్ట్ ఇదే !

  • 10 రోజుల్లో కేసు ఛేదించిన పోలీసులు

కోటబొమ్మాళి, ఆంధ్రప్రభ : కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ సమీపంలోని కుజ్జిపేట దాలిచెరువు వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. జూన్ 26న లభ్యమైన మృతదేహాన్ని ఒడిశాకు చెందిన లారీ డ్రైవర్ బాపూజీ స్వైన్ (41)గా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అతని తోటి డ్రైవ‌రే హత్యకు పాల్ప‌డిన‌ట్టు పోలీసులు తేల్చారు.

ఈ కేసుపై టెక్కలి రూరల్ సీఐ కె. శ్రీనివాసరావు నేతృత్వంలో, కోటబొమ్మాళి ఎస్సై వి. సత్యనారాయణ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగింది. అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసు చివరికి హత్య కేసుగా తేలింది. ఆదివారం కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ లక్ష్మణరావు వివరాలు వెల్లడించారు.

కక్షతో హత్యకు పథకం..

ఒడిశా గంజాం జిల్లాకు చెందిన కేదారి దాస్, బాపూజీ స్వైన్ ఇద్దరూ గతంలో ఒకే యజమాని వద్ద డ్రైవర్లుగా పనిచేశారు. ఈ సమయంలో డీజిల్ దొంగతనాల విషయాన్ని బాపూజీ స్వైన్ యజమానికి తెలియజేయడంతో కేదారి దాస్ ఉద్యోగం కోల్పోయాడు. దీంతో అతను బాపూజీపై కక్ష పెంచుకుని హత్యకు పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు.

జూన్ 25న అట్టల లోడుతో బొబ్బిలి వైపు వెళ్తున్న లారీకి కేదారి దాస్ కూడా తోడుగా వెళ్లాడు. బరంపురంలో మద్యం మత్తులో ఉన్న బాపూజీని డ్రైవర్ క్యాబిన్‌లో నిద్రపుచ్చి, తర్వాత వాహనాన్ని తానే నడిపాడు. ఎచ్చర్ల వరకు వెళ్లిన అనంతరం తిరిగి హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ సమీపంలోని కుజ్జిపేట దాలిచెరువు ప్రాంతానికి తీసుకువచ్చాడు.

అక్కడ రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో బాపూజీపై పిడిగుద్దులు గుద్ది, అతని మెడకు టవల్ బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని లారీ నుంచి దించి చెరువు గట్టుపై పడేశాడు. హత్య అనంతరం లారీలోని అట్టల లోడును నందిగాం మండలం కొత్త అగ్రహారం వద్ద దించి రూ.45,600కు అమ్మేసినట్లు విచారణలో తేలింది. ఆ తర్వాత వాహనాన్ని గొలంత్రా గ్రామం వద్ద వదిలి నిందితుడు పరారయ్యాడు.

డ్రైవర్ కనిపించకపోవడం, సరుకు మాయమవడం వంటి అంశాలపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు ప్రారంభమైంది. బాధితుడి భార్య ప్రభాసినీ స్వైన్ ఫిర్యాదుతో కేసు మరింత బలపడింది. చివరికి నందిగాం మండలం కొత్త అగ్రహారం వద్ద నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.18 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లు, ఐషర్ వాహనం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసును కేవలం పది రోజుల్లోనే ఛేదించిన పోలీసు బృందాన్ని డీఎస్పీ లక్ష్మణరావు అభినందించారు. త్వరలో వారికి రివార్డులు అందజేస్తామని ఆయన తెలిపారు.